అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదర నగర సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి రూ.1,125 కోట్ల విలువచేసే 225 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్న కేసులో ఆరుగురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్(ఎటిఎస్) అదుపులోకి తీసుకుంది. వడోదర జిల్లాకు చెందిన సావ్లీ తాలూకాలో నిర్మాణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో శుద్ధి చేయడానికి ముందు ఈ మెఫెడ్రోన్ భరూచ్ జిల్లాలోని సైఖా గ్రామంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో తయారైనట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమకు అందిన కచ్ఛితమైన సమాచారం ఆధారంగా మంగళవారం ఉదయం ఈ ఫ్యాక్టరీపై ఎటిఎస్ దాడి జరిపి అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,125 కోట్ల విలువ చేసే 225 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎటిఎస్ ఎస్‌పి సునీల్ జోషి బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వైష్ణవ్, పటేల్, మకాని, వసోయ, వఘాన్సియా, ధ్రువ్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. మ్యావ్ మ్యావ్ లేదా ఎండి డ్రగ్‌గా పిలిచే మెఫెడ్రోన్ మాదకద్రవ్యంపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద నిషేధం ఉంది.
Drugs worth Rs 1125 crore seized in Gujarat