న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1200 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తమిళనాడు రాజధాని చెన్నై నుంచి యూపీలోని లక్నోకు, అక్కడి నుంచి ఢిల్లీకి డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్, హిమాచల్, రాజస్థాన్‌లకు ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. స్మగ్లర్ల నుంచి 312.5 కిలోల మెథాంఫెటమైన్, 10 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఆపరేషన్‌లో భాగంగా, మేము 312 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నాము. అరెస్టయిన ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులు ఇప్పటికే నిఘాలో ఉన్నారు. సమాచారం మేరకు కాళింది సమీపంలోని ఓ కారు నుంచి ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నాం. నిందితులిద్దరినీ విచారించిన అనంతరం నోయిడా నుంచి హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.