Wednesday, April 16, 2025

సముద్రంలో స్మగ్లర్లు పడేసిన రూ. 1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ఉగ్ర నిరోధక బృందం (ఎటిఎస్), కోస్ట్ గార్డ్ రూ. 1800 కోట్లు విలువ చేసే 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు, స్మగ్లర్లు అంతర్జాతీయ సరిహద్దు రేఖ మీదుగా పారిపోయే ముందు వాటిని అరేబియా సముద్రంలో పడేశారని అధికారులు సోమవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మెథామ్‌ఫెటమైన్‌గా అనుమానిస్తున్నట్లు, వాటిని మరింత దర్యాప్తు నిమిత్తం ఎటిఎస్‌కు అప్పగించినట్లు భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసిజి) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎటిఎస్, కోస్ట్ గార్డ్ ఈ నెల 12 అర్ధరాత్రి గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సాగరప్రాంత సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్) సమీపంలో సంయుక్త ఆపరేషన్ సాగించినట్లు ఆ ప్రకటన తెలిపింది. కోస్ట్ గార్డ్ నౌక తమ దిశగా వస్తుండడం గమనించిన ఒక పడవలోని స్మగ్లర్లు డ్రగ్స్‌ను సముద్రంలో పడేసి, ఐఎంబిఎల్ దాటి పారిపోయారని ప్రకటన తెలిపింది.

’12 అర్ధరాత్రి ఒక ఆపరేషన్‌లో సముద్రంలో నిఘా ఆధారిత మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాన్ని గుజరాత్ ఎటిఎస్‌తో కలసి చేపట్టింది. రూ. 1800 కోట్లు విలువ చేసే 300 కిలోలకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడమైంది. స్వాధీనం చేసుకున్న ఆ సరకు మెథామ్‌ఫెటామైన్‌గా అనుమానిస్తున్నారు’ అని ప్రకటన వివరించింది. గుజరాత్ ఎటిఎస్ నుంచి అందిన ఒక సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్ రీజియన్ (పశ్చిమం) నుంచి ఒక ఐసిజి నౌకను ఐఎంబిఎల్ సమీపాన సముద్రంలో ఆ ప్రాంతానికి మళ్లించినట్లు, అక్కడ ఒక అనుమానిత పడవ ఉనికిని కనుగొన్నట్లు ప్రకటన తెలిపింది. ‘ఐసిజి నౌక చిమ్మచీకట్లో కూడా ఒక అనుమానిత పడవను గుర్తించింది. ఆ నౌక తమ వైపు వస్తుండడం గమనించి అనుమానిత పడవ తన మాదకద్రవ్యాల సరకును సముద్రంలో పడేసి ఐఎంబిఎల్ దిశగా పరారైంది. అప్రమత్తమైన ఐసిజి నౌక అనుమానిత పడవను వెంటాడనారంభించి, ఆ సరకును వెంటనే స్వాధీనం చేసుకోవడానికి తన సముద్ర పడవను నియోగించింది

’ అని ఆ ప్రకటన వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ దగ్గరంగా ఉండడం, అనుమానిత పడవను కనిపెట్టిన సమయంలో దానికి, కోస్ట్ గార్డ్ నౌకకు మధ్య ఆదిలో దూరం ఉండడం ఆ పడవ తనను అటకాయించకుండా తప్పించుకుని స్వల్ప వ్యవధిలోనే ఐఎంబిఎల్ దాటిపోయిందని ప్రకటన తెలియజేసింది. ఆ తరువాత కోస్ట్ గార్డ్ బృందం సంక్లిష్ట రాత్రి పరిస్థితుల్లో ముమ్మరంగా అన్వేషించి సముద్రంలో నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నదని ప్రకటన తెలిపింది. ‘స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను మరింత దర్యాప్తు నిమిత్తం ఐసిజి నౌక పోర్బందర్‌కు తీసుకువచ్చింది’ అని ప్రకటన తెలియజేసింది. ఇటీవలి సంవత్సరాల్లో అటువంటి 13 చట్టం అమలు కార్యక్రమాలకు దారి తీసిన కోస్ట్ గార్డ్, ఎటిఎస్ సహకారం ‘జాతీయ లక్ష సాధనకు ఉమ్మడి కృషిని పునరుద్ఘాటిస్తోంది’ అని ప్రకటన పేర్కొన్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News