గుజరాత్: ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 5 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తదుపరి విచారణ కోసం పడవ, దానిలోని ఆరుగురు సిబ్బందిని జాఖౌకు తీసుకువస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం రాత్రి, కోస్ట్ గార్డ్ అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో పెట్రోలింగ్ కోసం సి-429, సి-454 అనే రెండు ఇంటర్‌సెప్టర్ షిప్‌లను మోహరించింది. అర్ధరాత్రి సమయంలో, గుజరాత్‌లోని జఖౌ నుండి 40 నాటికల్ మైళ్ల దూరంలో, భారత భూభాగంలో ఐదు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పదంగా కదులుతున్న పాకిస్థాన్ బోట్ గమనించినట్లు తెలిపింది.
పాకిస్తాన్ పడవ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కోస్ట్ గార్డ్ నౌకలు పాకిస్థాన్ పడవను అడ్డగించి బలవంతంగా ఆపాయి. బోటు ఎక్కుతుండగా ఐదు గన్నీ బ్యాగుల్లో దాచి ఉంచిన 50 కిలోల మాదక ద్రవ్యాలు హెరాయిన్ ను అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో గుజారాత్ ఏటీఎస్ తో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన ఆరో ఆపరేషన్ ఇది. అదే సమయంలో గత నెల రోజుల్లో ఇది రెండో విజయం. అంతకుముందు సెప్టెంబర్ 14న పాకిస్థాన్ బోటులో సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ పట్టుబడింది.