రూ. 88 కోట్లు విలువ చేసే మెథామ్‌ఫెటామైన్ టాబ్లెట్ల భారీ సరకును స్వాధీనం చేసుకున్నట్లు, ఇంఫాల్, గౌహతి మండలాల్లో అంతర్జాతీయ డ్రగ్ ముఠా సభ్యులు నలుగురిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం వెల్లడించారు. భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం దర్యాప్తు దిశగా సంపూర్ణ దృక్పథానికి ప్రబల నిదర్శనం అని కూడా అమిత్ షా అన్నారు. డ్రగ్స్‌పై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూనే ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ‘డ్రగ్స్ మాఫియాపై దయాదాక్షిణ్యాలు ఏమీ ఉండవు. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం దిశగా మోడీ ప్రభుత్వ ప్రస్థానాన్ని వేగవంతం చేస్తూ రూ. 88 కోట్లు విలువ చేసే మెధామ్‌ఫెటామైన్ ట్యాబ్లెట్ల భారీ సరకును స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్, గౌహతి జోన్‌లలో అంతర్జాతీయ డ్రగ్ ముఠా సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు’ అని అమిత్ షా ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ఈ విజయానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి)కి హోమ్ శాఖ మంత్రి ‘హృదయపూర్వక’ అభినందనలు తెలియజేశారు.
ఒక సమాచారం ఆధారంగా ఎన్‌సిబి ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని, ఎన్‌సిబి బృందం లైలాంగ్ ప్రాంతంలో ఒక ట్రక్‌ను అడ్డుకుని, ట్రక్ వెనుక భాగంలో ఒక టూల్‌బాక్స్‌లో నుంచి 102.39 కిలోల మెథామ్‌ఫెటామైన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారని ఒక అధికార ప్రకటన వెల్లడించింది. ట్రక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ఆ ప్రకటన తెలియజేసింది. ఆ బృందం ఏమాత్రం ఆలస్యంచేయకుండా తదుపరి ఆపరేషన్ నిర్వహించి, లైలాంగ్ ప్రాంతంలో ఆ నిషిద్ధ డ్రగ్స్ అందుకున్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని పట్టుకున్నదని ఆ ప్రకటన తెలిపింది. డ్రగ్స్ అక్రమరవాణాకు ఉపయోగించిన ఒక నాలుగు చక్రాల వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఆ తరువాత సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రకటన తెలియజేసింది. ఆ నిషిద్ధ డ్రగ్స్‌కు అనుమానిత మూలస్థానం మణిపూర్‌లోని మోరెహ్ పట్టణం అని, ఈ కేసులో పాత్ర ఉన్న ఇతరుల పట్టివేతకు మరింత దర్యాప్తు సాగుతోందని ప్రకటన తెలియజేసింది.
అదే రోజు మరొక ఆపరేషన్‌లో ఎన్‌సిబి గౌహతి జోన్ అధికారులు సిల్చార్ సమీపాన అస్సాం మిజోరమ్ సరిహద్దులో ఒక ఎస్‌యువిని అటకాయించి, వాహనం స్టెప్నీ లోపల దాచిన 7.48 కిలోల మెథామ్‌ఫెటామైన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు, వాహనంలో ఉన్నవారిని అరెస్టు చేసినట్లు ప్రకటన తెలిపింది. ఆ నిషిద్ధ డ్రగ్స్‌కు మూల స్థానం మొరెహ్ అని, వాటి గమ్యస్థానం అస్సాంలోని కరీమ్‌గంజ్ అని ప్రకటన తెలియజేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతరుల పట్టివేతకు మరింత దర్యాప్తు సాగుతోందని ప్రకటన తెలిపింది.