సిటిబ్యూరోః ఈ ఏడాది నాలుగు నెలల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైదరాబాద్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులు 13,429మంది పట్టుబడ్డారు. వారిలో 12,877మందిపై ఛార్జిషీట్ దాఖలు చేయగా, 1,317 మందికి జైలు శిక్ష విధించారు. నాలుగు నెలల్లో 243మంది మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను కోర్టులో హాజరు పర్చగా వారికి రూ.3, 21,39,060 జరిమానా విధించారు.
గత నెల ఏప్రిల్ నెలలో హైదరాబాద్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. మందుబాబులు 2,687మంది పట్టుబడగా వారికలో 1,717మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మద్యం తాగి పట్టుబడిన వారికి కోర్టు గత నెలలో రూ.35,90,500 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా వారిలో మార్పు రావడంలేదు. పోలీసుల మాటను పెడచెవిన బెట్టి మద్యం తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
యువతే ఎక్కువ….
మద్యం తాగి వాహనాలను నడుపవద్దని పోలీసులు ఎంతగా చెప్పినా యువత మారడంలేదు. అర్ధరాత్రి వరకు మద్యం తాగి వామనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో అమాయకులు వీరి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆస్పత్రి ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అమాయకులు మృతిచెందారు. పనిముగించుకుని రోడ్డుదాటుతుండగా మద్యం తాగి అతివేగంగా కారు నడుపుకుంటూ వచ్చిన యువకుడు ఢీకొట్టడంతో పైకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటి నుంచి నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడుతున్నారు. ఈ ప్రాంతాల్లో బార్లు, పబ్బులు ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు మద్యం తాగి వాహనాలపై రోడ్లపైకి వస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వారాంతాల్లో ఎక్కువగా మందుబాబులు పట్టుబడుతున్నారు. పోలీసులు కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందరెడ్డి పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా మద్యం తాగి బైక్‌ను నడుపుకుంటు ఓ వ్యక్తి వచ్చాడు.అతడికి బ్రీతింగ్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. సదరు వ్యక్తి బైక్ వెనుక కూర్చున్న భార్య గర్భవతి కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గర్భతిని బైక్‌పై ఎక్కించుకుని మద్యం తాగి ఎలా డ్రైవ్ చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.