జైపూర్‌లోని ఇరుకు రోడ్డులో కాంగ్రెస్ నాయకుడొకరు తాగిన మత్తులో పాదచారులపై ఎస్‌యువిని వేగంగా నడపడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ వెంటనే ఆ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ప్రతిపక్ష బిజెపి పార్టీ మాత్రం ‘కాంగ్రెస్‌లో నేర ప్రవృత్తి కలిగిన వారు దండిగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించింది. కారు ఎంఐ రోడ్డు నుంచి సహర్‌గఢ్ ప్రాంతంలోని ఇరుకైన సందులో వెళుతుండగా, అది దారిలో ఉన్న పాదచారులను, వాహనాలను ఢీ కొట్టింది. ఆ కారును నడింపింది 62 ఏళ్ల ఉస్మాన్ ఖాన్‌గా గుర్తించారు. ఆయన ఓ ఫ్యాక్టరీ యజమాని, పైగా కాంగ్రెస్ జైపూర్ జిల్లా ఉపాధ్యక్షుడు.
ఈ ఘటన తర్వాత బాధితులకు, వారి బంధువులకు ఆర్థిక పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, ఇతర సాయం అందించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి రోడ్లను దిగ్భంధించి నిరసన తెలిపారు. శాస్త్రినగర్‌లోని రాణా కాలనీ నివాసి అయిన ఉస్మాన్ ఖాన్ ఘటన జరిగిన సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని అదనపు డిసిపి(నార్త్) బజరంగ్ సింగ్ షెకావత్ తెలిపారు. గాయపడిన వారినందరినీ సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటన తర్వాత అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు.