ముంబై: బాంకాక్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టస్‌తో ఓ స్వీడిష్ జాతీయుడు తప్పతాగి దుర్వ్యవహారం చేశారు. అతడిని గురువారం అరెస్టు చేశారు. ఇండిగో విమానం(6ఈ -1052) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే క్లాస్ ఎరిక్ హెచ్.జె.వెస్ట్‌బర్గ్(63)ను పట్టుకున్నారు. అతడు విమానంలో నాలుగు గంటలపాటు ప్రయాణిస్తున్నంత సేపు ఎయిర్ హోస్టస్‌ను ఇబ్బంది పెట్టాడు.
అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు అతడిని రూ. 20,000 బెయిల్‌పై శుక్రవారం విడుదలచేసింది. అయితే ఈ వ్యవహారాన్ని సహారా ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఎరిక్ తనకు సీఫుడ్ కావాలని ఆర్డరు ఇచ్చాడు. ఎయిర్ హోస్టస్ సీఫుడ్ లేదని కేవలం చికెన్ మాత్రం ఉందని తెలిపింది. అదే అతడికి అందించింది. తర్వాత అతడిని క్రెడిట్ కార్డుతో బిల్లు పే చేయమని అడిగినప్పుడు అతడు ఎయిర్ హోస్టస్ చేయిపట్టుకున్నాడు. కానీ ఆమె అతడిని సీట్లోకి తోసేసింది. కానీ అతడు లేచి ఇతర ప్రయాణికుల ముందే ఆమెతో దుర్వవహారం చేశాడు. దాంతో ఆమె సాయం కోసం అరిచింది. మరో సిబ్బందితో కూడా అతడు వాదానికి దిగాడు. నోటికొచ్చినట్లు తిట్టాడు. జోక్యం చేసుకున్న ఓ ప్రయాణికుడినైతే కొట్టాడు. బాధిత 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్, ఫ్లయిట్ కెప్టెన్‌ను అప్రమత్తం చేసింది. సీటు నెం. 28-ఈ ప్రయాణికుడయిన అతడిని ఫ్లయిట్ కెప్టెన్ హెచ్చరించాడు. కానీ అతడు వినిపించుకోలేదు.
విమానం సహారా ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే సిఐఎస్‌ఎఫ్ జవానులు అతడిని పట్టుకుని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.