Friday, November 15, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్: పోలీసులనే ఢీకొట్టిన మందుబాబులు..

- Advertisement -
- Advertisement -

మద్యం మత్తులో పోలీసులనే ఢీకొట్టారు
ఎఎస్‌ఐ, హోంగార్డుకు గాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎఎస్‌ఐ

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని నిజాంపేట్‌లో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం సేవించి కారును వేగంగా నడపిన ఘటనలో హోంగార్డు, ఎఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలిని పరిశీలించేందుకు ఎస్‌ఐ సక్రమ్, ఎఎస్‌ఐ మహిపాల్ రెడ్డి వెళ్లారు. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి కారును వేగంగా నడిపించాడు. మద్యంలో ఉన్న తాను పోలీసులకు దొరికితే శిక్ష పడుతుందని తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా పోలీసులపైకి కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో ఎఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈక్రమంలో ప్రమాదంలో ఎఎస్‌ఐకి తీవ్రగాయాలు కాగా వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో సృజన్ అనే వ్యక్తి డ్రంక్‌అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునే క్రమంలో హోంగార్డులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. హోంగార్డు స్థానిక హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సృజన్ అనే యువకుడికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా 170 పాయింట్ల వచ్చాయి. దీంతో పోలీసులు అతడి కారు సీజ్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సృజన్ కారును రివర్స్ తీసుకోగా వెనకాల ఉన్న హోంగార్డుకు గాయాలయ్యాయని పోలీసు అధికారులు వివరించారు. హైదరాబాద్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఎన్నిసార్లు చేపట్టినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనం నడిపితే సీజ్ చేస్తారన్న భయం కూడా లేకుండా కొందరు తప్పతాగి రోడ్లపై హంగామా చేస్తున్న ఘటనలపై పోలీసు బాసులు సీరియస్ అవుతున్నారు. ఎఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు తలకు తీవ్ర గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Drunkers hits Police with Car in Nizampet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News