25న వాయుగుండం బంగ్లాదేశ్‌వద్ద తీరం దాటే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజులుగా వ్యవసాయరంగాన్ని ఆందోళన గొలుపుతూ వచ్చిన తుపాన్ ముప్పు తెలంగాణ ప్రాంతానికి తప్పిపోయింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పొడివాతావరణం వుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరికోతల పనుల్లో ఉన్న రైతులకు వాతావరణ కేంద్రం చేసిన ప్రకటన పెద్ద ఊరట నిస్తొంది. రాష్ట్రమంతటా వానాకాలం సాగు చేసిన పలు రకాల పంటలు కొత దశలో ఉన్నాయి.అయితే గత వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతి కూల వాతావరణం , వర్షాలు , తుపాన్ హెచ్చరికలతో వ్యవసాయరంగం కలవరపడుతూ వచ్చింది. పొడి వాతావరణం ఇదే రీతిలో మరో వారం రోజుల పాటు కొనసాగితే రాష్ట్రమంతటా పంట కోతలు ఊపందుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గత 24గంటలుగా వాతావరణం కొంత తెరిపినిచ్చింది. రాష్ట్రమంతటా పొడివాతవరణం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నందున వరికోతల పనులు ఒక్క సారిగా ఊపందుకుంటున్నాయి.
25న తీరం దాటనున్న వాయుగుడం
తెలంగాణ రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్టే అని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 22న తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చకలతో వ్యవసాయం రంగం కొంత ఆందోళనకు గురయినా తుపాను తేలిపోవటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారం నాటి వాయుగుండం బలపడి వాయువ్యదిశగా ప్రయాణించింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ సాగర్ ద్వీపానికి 670కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం వాయువ్యదిశగా కదిలి రాగల 12గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ తరువాత ఇది తన దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలోని తింకోన ద్వీపం ,శాండ్విప్ మధ్యలో బరిసల్‌కి దగ్గర్లో ఈ నెల 25 ఉదయానికి తీరం దాటే అవకావం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.