బెంగళూరు: కర్నాటకలో జరుగనున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్(ఎస్) మహిళలకు 30 నుంచి 35 సీట్లు కేటాయించనున్నట్లు ఆ పార్టీ నాయకుడు హెచ్ డి కుమారస్వామి బుధవారం తెలిపారు. తమ పార్టీలో మహిళా విభాగంను మరింత బలోపేతం చేసేందుకు మహిళా అభ్యర్థునులకు ప్రాధాన్యతనివ్వనున్నామని కూడా ఆయన తెలిపారు.
“మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో మేము మహిళలకు కనీస 30 నుంచి 35 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాము. మొదటి దశలో ఆరేడు మంది మహిళా అభ్యర్థునులను మేము గుర్తించాము” అని కుమారస్వామి తెలిపారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు 30 నుంచి 35 సీట్లు ఇవ్వాలన్నది తమ పార్టీ వ్యవస్థాపకుడు హెచ్‌డి దేవగౌడ కోరిక అని తెలిపారు.
2023లో తిరిగి అధికారాన్ని పొందడానికి పార్టీ నాయకులతో నిర్వహించిన నాలుగు రోజుల వర్క్‌షాప్ ‘జనతా పర్వ 1.0’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు. తన స్వంత బలంతోనే జెడి(ఎస్) అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 123 సీట్లు గెలువాలన్న లక్షాన్ని ఆయన పెట్టుకున్నారు.