హైదరాబాద్ : ఈ నెలాఖరు నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగిసి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ఒక స్పష్టత వస్తుందని, అనంతరం డిఎస్‌సి98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరుతామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పంజాగుట్టలోని నివాసంలో మంత్రిని 1998 డిఎస్‌సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ అర్హులకు ఉద్యోగాలు
ఇచ్చే విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఆందోళన చెందవద్దన్నారు. ఎన్నికల కోడ్ వస్తుందేమోనన్న భయాందోళనలో డిఎస్‌సి98 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని, త్వరితగతిన న్యాయం చేయించాలని శ్రీనివాస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కోరగా ఎన్నికల కోడ్ కు ముందే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన వారిలో సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్ ఉన్నారు.