మనతెలంగాణ : డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయమై మాట్లాడే అవకాశం ఉన్నదని, త్వరితగతిన న్యాయం చేయిస్తానని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభయం ఇచ్చారు. బుధవారం డిఎస్‌సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి సబితను ఆమె నివాసంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో
తమకు ఉద్యోగాలు ఇంకెప్పుడు వస్తాయోనన్న ఆందోళనలో అభ్యర్థులు అందరూ తీవ్ర మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారని శ్రీనివాస్ ఆమెకు తెలియజేశారు. అందరి ముఖంలో సంతోషం కోరుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేసే విషయంలో కూడా త్వరలోనే శుభవార్తను ప్రకటించి బాధితుల కుటుంబాలలో వెలుగులు నింపుతారన్న గంపెడాశతో ఎదురుచూస్తున్నారని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో మట్టపల్లి ఉపేందర్, రాములు తదితరులు ఉన్నారు.