మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్‌సి 2024 ఫలితాల్లో 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు మినహా మిగతా పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. సుమారు 10 వేల ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల డిఎస్‌సి 2024 ఫలితాలు విడుదల కాగా, జిల్లాల వారీగా 1:3 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాలేదు. ఈ నోటిఫికేషన్ ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్‌జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
అయితే ఈ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అవసరం లేదని, ఒకవేళ టెట్ నిర్వహించాల్సి వస్తే ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలని ఏప్రిల్ గత ఏప్రిల్‌లో 26 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం వారికి డిఎస్‌సి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసులో భాగస్వామ్యం కాని అభ్యర్థులు ఉన్న జిల్లాలకు మాత్రమే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. జిల్లా నుండి ఒక్క అభ్యర్థిన కేసులో ఉన్నా ఆ జిల్లాకు వెరిఫికేషన్ నిలిపివేశారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కానీ జిల్లాల అభ్యర్థులకు కూడా వెరిఫికేషన్ నిర్వహించేందుకు అనుమతి తీసుకుని అన్ని జిల్లాలకు ధృవపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం(అక్టోబర్ 9) ఎల్.బి.స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.