హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డిఎస్‌సి) వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్‌సి) నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో డిఎస్‌సి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చెప్పారు. ఇటీవల గ్రూప్- 2 పరీక్షలను సైతం టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 20 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 21 వరకు కొనసాగనుంది. 5,089 పోస్టులకు 2-2.5 లక్షల మంది పోటీపడతారని అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్ నిర్వహించనున్న నేపథ్యంలో నవంబర్‌లో నిర్వహించకుంటే.. మళ్లీ ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టిసిఎస్ అయాన్ అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ 2024 ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.