Thursday, January 23, 2025

మైనింగ్ మాఫియాను అడ్డుకున్న డిఎస్‌పి.. దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: మైనింగ్ మాఫియా అక్రమాలను అడ్డుకుంటున్న ఒక డిఎస్‌పి మంగళవారం హర్యానాలో దారుణ హత్యకు గురయ్యారు. అక్రమ స్టోన్ మైనింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఆ డిఎస్‌పిపై పత్రాల పరిశీలన కోసం ఒక ట్రక్కును ఆపడానికి ప్రయత్నించగా ఆయనపైనుంచే ట్రక్కు దూసుకెళ్లింది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. తౌరుకు చెందిన డిఎస్‌పి సురేంద్ర సింగ్ మంగళవారం ఒక డంపర్ ట్రక్కును అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆ ట్రక్కును ఆయనపైనుంచే డ్రైవర్ వేగంగా తీసుకెళ్లాడు. ఆ సమయంలో డిఎస్‌పి పక్కన ఉన్న గన్‌మన్, డ్రైవర్ పక్కకు దూకి తమ ప్రాణాలను రక్షించుకోగలిగారని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ సంఘటనలో ట్రక్కు కింద పడి తీవ్రంగా గాయపడిన డిఎస్‌పిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు అధికారులు తెలిపారు. తౌరు సమీపంలోని పచ్‌గావ్ ప్రాంలోని అరవల్లి కొండలలో అక్రమ మైనింగ్‌నుఅడ్డుకోవడానికి డిఎస్‌పి సురేంద్ర సింగ్ తన బృందంతో కలసి దాడి చేయడానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగిందని వారు చెప్పారు. డిఎస్‌పి హత్యకు కారకుడైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1994లో హర్యానా పోలీసు శాఖలో ఎఎస్‌ఐగా నియమితులైన డిఎస్‌పి సింగ్ మరి కొద్దినెలల్లో రిటైర్ కానున్నారు.

DSP Murdered by Mining Mafia in Haryana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News