ఢిల్లీ వర్సిటీ అనుబంధ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ నిర్ణయం
భార్య వసంతకు సమాచారం, కోర్టుకు వెళతానని ప్రకటన
న్యూఢిల్లీ : అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను ఢిల్లీ వర్శిటీ అనుబంధమైన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ సర్వీసు నుంచి తొలిగించింది. మావోయిస్టులతో సంబంధాల సంబంధిత కేసులో సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను శాశ్వతంగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు కాలేజీ మొమోను ప్రొఫెసర్ భార్య వసంతకు గురువారం పంపించింది. మార్చి 31 మధ్యాహ్నం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యతల నుంచి సాయిబాబాను టర్మినేట్ చేస్తున్నట్లు ఇందులో తెలిపారు. ఈ లేఖపై కాలేజీ ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ గుప్తా సంతకం ఉంది. ఈ టర్మినేషన్ ఉత్తర్వులను తాము న్యాయస్థానంలో సవాలు చేస్తామని వసంత విలేకరులకు తెలిపారు.
విధుల నుంచి తక్షణం తొలిగిస్తున్నట్లు, మూడు నెలల వేతనాన్ని ఆయన బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నట్లు కాలేజీ వర్గాలు తెలిపాయి. సాయిబాబా ఆంగ్లభాష విభాగంలో విధులలో కొనసాగుతున్నారు. ఆయనను విధుల నుంచి తప్పించడం అధికార వర్గాల కక్షసాధింపు ధోరణి అని వసంత విమర్శించారు. ఆయనకు శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ ఇప్పటికీ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ దశలో కాలేజీ అధికార వర్గాలు ఈ చర్య తీసుకోవడం అ నుచితం అన్నారు. సాయిబాబాపై చర్యను ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ నందితా నారాయణ్ ఖండించారు. సాయిబాబా మద్దతుగా పోరాడుతామన్నారు.
DU college terminates jailed scholar GN saibaba prof