Thursday, January 23, 2025

సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదు:మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ ః సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని ఐటి, పరిశమ్రల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్‌జి 3 ఏరియా ఓసిపి 1 ప్రాజెక్టులో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంలో కార్మికులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రితో కరచాలనం కోసం కార్మికులు పోటీపడ్డారు. దారి పొడవునా జేజేలతో స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిపించిన కార్మికులకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం జరిగిన గేట్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండవద్దని చెప్పినట్టు గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు,

మెడికల్ అన్‌ఫిట్, ప్రమోషన్లు, క్వార్టర్ల కేటాయింపుల్లో రాజకీయ జోక్యం ఉండదని, నయా పైసా ఖర్చు లేకుండా పనులు జరుగుతాయని భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్మికుల మంచి, చెడును చూసే ఐఎన్‌టియుసి ప్రభుత్వానికి అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించిన కార్మిక వర్గం రాబోయే ఎన్నికల్లోనూ ఐఎన్‌టియుసిని గెలిపించి మరింత బలాన్ని ఇవ్వాలన్నారు. రాహూల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు కార్మిక సంక్షేమంలో రాజీ లేకుండా పనిచేస్తామని అన్నారు. కార్మికుడు రిటైరైన తరువాత కిరాయి ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారని, ఐదు సంవత్సరాల కాలంలో కార్మికుల చిరకాల వాంఛ అయిన స్వంత ఇంటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సింగరేణిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్‌పరం చేయబోమని స్పష్టం చేశారు. నూతన భూగర్భ గనులను తెరిచి ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు. సింగరేణిలో ఉన్నత విద్యార్హతతో డిపెండెంట్‌గా ఉద్యోగాల్లో చేరిన వారికి సంత్సరం తరువాతనే అంతర్గత రిక్రూట్‌మెంట్‌కు అర్హత కల్పిస్తామని అన్నారు. మూడు రీజియన్‌లలో సూపర్ స్పెషాలిటీ తరహలో ఆసుపత్రులు నిర్మించడంతో పాటు ప్రత్యేక వైద్య నిపుణులను, సరిపడా వైద్య పరికరాలను అమరుస్తామని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా సిబిఎస్‌ఇ సిలబస్ అమలు చేయిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాదాన్యత ఇస్తుందని, సింగరేణిలో మహిళలకు సైతం అదే రీతిలో ప్రాదాన్యం ఉంటుందన్నారు. భత్యాలపై ఐటిని రీయింబర్స్‌మెంట్ చేయిస్తామని అన్నారు. మారుపేర్లను న్యాయచిక్కులు లేకుండా ఎన్నికల తరువాత పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, ఆర్‌జి3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్‌రెడ్డి, ఎస్‌కె అక్బర్ అలీ, గడ్డం తిరుపతి, కిషన్‌నాయక్, రవి, వెంకటస్వామి, మార్కండేయ, లక్ష్మణ్‌రావ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News