Sunday, November 17, 2024

గౌడ జీవన పురాణం ‘దుల్దుమ్మ’

- Advertisement -
- Advertisement -

గౌడుల జీవితాలపై ఆధునికత, ప్రపంచీకరణ ఎలా పంజా విసిరిందో తెలిపే అరుదైన కథల, నవలల రచయిత నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్. కనబడని కుట్రల పాలైన గౌడ జీవితాలను పలు కోణాల్లో విశ్లేషించిన రచన ఆయన ’దుల్దుమ్మ’ నవల. తన జాతి వెతలను తెలిపేందుకు కలం పట్టిన నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ స్వయంగా గీత వృత్తికారుడు. రోజూ తాటి, ఈత చెట్లెక్కి మండువాలో కల్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్న శ్రమజీవి. జగిత్యాల సమీపంలోని హనుమాజీపేట ఆయన నివాసం.
శ్రామిక కులాల్లోంచి వచ్చిన రచయితలు /రచయిత్రులలో ఎక్కువ శాతం చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డవారే. కులవృత్తి నేపథ్యంలో తమ వారి జీవితాల గురించి వారు రాసినవి కూడా తక్కువే. ఒక వృత్తిలోని కష్టసుఖాలను, లాభనష్టాలను ఆ జీవితాలను అనుభవించినవారే సరిగ్గా రాయగలరు. రైతు గోస గురించి రైతు బిడ్డ రాసినట్లు ఇతరులకు సాధ్యపడదు.

వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి తదితర వృత్తుల్లో ఉన్న శ్రమజీవన వాస్తవాలు కూడా కథలుగా, నవలలుగా రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. మారిన కాలంతో ఒక్కో కులంలో వచ్చిన ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు రచనల్లో దాచుకోవాలి. ఈ దిశగా ’దుల్దుమ్మ’ నవల రాసి శ్రీనివాస గౌడ్ తన కులకష్పిలోని ఒడుదొడుకులను చాలా వివరంగా, లోతుగా చర్చలోకి తెచ్చారు. అందువల్ల ఈ నవల ఒక విశేష రచనగా గుర్తించబడింది.
నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ మొదటి నవల ’బతుకుతాడు’. 2004 లో వచ్చింది. ఈ నవలలో శ్రీనివాస్ తల్లిదండ్రులే ప్రధాన పాత్రలు. కల్లు గీసే తండ్రి, బీడీలు చేసే తల్లి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల కూర్పే దీని కథా వస్తువు. ఈ మధ్య కాకతీయ విశ్వవిద్యాలయం బతుకుతాడు నవల ను ఎం ఏ తెలుగు నాల్గవ సెమిస్టర్ సిలబస్ లో చేర్చింది.

‘దుల్దుమ్మ’ అనేది పొద లాంటి ఒక చెట్టు పేరు. దాని ఆకులు, కాయలు శరీరానికి తగిలితే చాలాసేపు విపరీతమైన దురద కలుగుతుంది. రాత్రివేళ దొంగలబారి నుండి చెట్లపైనున్న కల్లు కుండలను కాపాడేందుకు గౌడులు దుల్దుమ్మను ఆయుధంగా ఉపయోగిస్తారు . అందుకే ప్రతీకాత్మకంగా రచయిత ఈ నవలకు ఆ పేరు ఎంచుకున్నారు. నవలలో కూడా స్వీయరక్షణ కోసం దుల్దుమ్మను వాడిన సందర్భాలున్నాయి.ఈ నవల స్థూలంగా గౌడుల పెద్ద అయిన నర్సయ్య గౌడ్, ఆయన కుటుంబం, మిగితా కులాల గ్రామస్థుల సంబంధాల చుట్టూ నడుస్తుంది. కల్లు గీతపై బతికే గౌడుల వృత్తిపర సమస్యలు ప్రధానంగా చర్చలోకి వస్తాయి. ఊరి పెద్దలతో, ఆబ్కారీ శాఖతో తమ వృత్తిలో ఎదురయ్యే దినదినగండంలాంటి వెతలను కులపెద్దగా నర్సయ్య గౌడ్ ముందుండి ఎదుర్కొనే సందర్భాలు ఇందులో ప్రధాన ఘట్టాలు. కుల వృత్తిలో చితికి పోతున్న కుటుంబాలకు నమూనాగా నర్సయ్య గౌడ్, ఆయన కొడుకు, మనమడు, ఆ ఇంట్లో ఆడవాళ్లు నిలుస్తారు. మూడో తరానికి చెందిన మనిషి కుల వృత్తికి దూరమై పట్నవాసానికి మారడంతో కథ ముగుస్తుంది.

గౌడ వృత్తి, జీవనంలోని ప్రతి సూక్ష్మ అంశం ఈ నవలలో కనబడుతుంది. గౌడులు వాడే పరికరాలు, తాటి, ఈత చెట్లలో రకాలు, వాటి పేర్లు, కల్లులో రకాలు, వాటి రుచులు, గుణాలు చాలా వివరంగా పేర్కొనబడ్డాయి. కల్లు పారే రుతువులు, అందుకు చెట్లను సిద్ధం చేసే తీరు ఒక శాస్త్రంలా అనిపిస్తుంది. తాటి చెట్లలో ఆడ, మగ రెండు రకాలుంటాయి. మగ తాటిచెట్టు గొలకు పూత పూస్తుంది. ఆ పూత గాలికి ఆడచెట్టుపై పడుతుంది. ఆడ తాటి చెట్టుకు ముంజకాయలు కాస్తాయి. తాటి, ఈత చెట్లకు మూడు రకాల పన్ను కట్టాలి. చెట్టు పన్ను ప్రభుత్వానికి. జుట్టు పన్ను కల్లు అమ్ముకొనే స్థలానికి. చెట్టు గల భూమి యజమానికి ఇచ్చేది మూడవ పన్ను. ఊరి దొరకు వెట్టి కింద ఏడాదికి ఒకరు రెండు చెట్లు ఇచ్చి వాటి కల్లును గీసి దొర ఇంట్లో పెట్టాలి. ఇలా పూసగుచ్చినట్లు గౌడుల బతుకుదెరువును ఈ నవలలో చూడవచ్చు. గౌడుల దేవతలు, పూజలు, పండుగల గురించి రచయిత దృశ్యమానంగా వివరించారు. కాటమయ్య గౌండ్లోల్ల దేవుడు. ముంజకాయలు కోసే ముందు ప్రతి సంవత్సరం ఆయన్ని పూజిస్తారు. రేణుకా ఎల్లమ్మ వీరి ఆరాధ్య దైవం.

మూడేండ్లకోసారి ఎల్లమ్మ పట్నాలు చేస్తారు. దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. పట్నాల వేడుక అంటే విగ్రహాల శుద్ధి, అలంకరణ, బైండ్ల పూజారులు, మేకల జడితులు, గావు, డప్పులు, గజ్జెలు, గరుడ స్తంభం మోత, నృత్యాలు, వంటకాలు, భోజనాలు కలగలిసి ఊరంతా జాతరగా సాగుతుంది. గౌడుల ఆశ్రితులైన గౌడ శెట్టిలు మూడేళ్లకోసారి వచ్చి గౌడ పురాణం గానం చేసి ఇచ్చింది తీసుకోని వెళుతుంటారు. గౌడుల ఆర్థిక స్థితి దిగజారినందున వారిని సంభావించుకోలేక వదులుకొనే కాలం వస్తుంది.దుల్దుమ్మ పేరుకు తగ్గట్లు సొగసైన మాండలిక భాషతో పరిపుష్టమైంది. రచయిత శ్రీనివాస్ గౌడ్ ఎంతో ఇష్టంగా స్థానిక వాడుక భాషను పుస్తకం నిండా వాడి ఎన్నో పదాలకు పట్టం కట్టారు. అందుకే తెలుగు విశ్వవిద్యాలయం ’దుల్దుమ్మ’ ఉత్తమ నవలగా రచయితను సత్కరించింది. తన భార్య సత్తెమ్మ బీడీలు చేస్తూ వచ్చిన పైసలతో చిట్టీలు కట్టి నవల ముద్రణకు డబ్బులు సర్దింది అని శ్రీనివాస్ అంటుంటే ఈ నవల రాక వెనుక ఉన్న శ్రమ వెలకట్టలేనిదనిపిస్తుంది.

దుల్దుమ్మ (నవల)
రచన : నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్
పేజీలు 335 , వెల : రూ.320/-
ప్రతులకు : నేరెళ్ల సత్తవ్వ, హనుమాజీపేట- 505529,
9989142403.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News