Wednesday, January 22, 2025

ప్రథమ్, తిలక్ సెంచరీలు.. ఇండియా-డి ముందు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డితో జరుగుతున్న రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా ఎ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. ప్రత్యర్థి జట్టు ముందు ఇండియా ఎ 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా డి శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇండియా డి టీమ్ మరో 426 పరుగులు చేయాలి. ఓపెనర్ యశ్ దూబె (15), రికి భుయ్ (44) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఇండియా ఎ రెండో ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్, వన్ డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మలు శతకాలతో చెలరేగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ప్రథమ్ సింగ్ 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 122 పరుగులు చేశాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ 9 ఫోర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక శశ్వత్ రావత్ ఏడు బౌండరీలతో అజేయంగా 64 పరుగులు చేశాడు. స్కోరు 380 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇండియా ఎ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. కాగా, ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు సాధించింది. ఇండియా డి టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది.

ఆదుకున్న అభిమన్యు..
ఇండియా సితో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఇండియా బి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 309 పరుగులుచేసింది. ఇక ఇండియా సి తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే బి టీమ్ మరో 216 పరుగులు చేయాలి. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అభిమన్యు 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 143 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ జగదీశన్ (70) తనవంతు పాత్ర పోషించాడు. మిగతా వారు విఫలమయ్యారు. కాగా, ఇండియా సి తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగుల భారీ స్కోరును సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News