భిండ్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఓ డంపర్ ట్రక్, వ్యాన్‌ను ఢికొనగా ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. జవహర్‌పుర గ్రామ సమీపంలో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో వివాహ కార్యక్రమం ముగించుకుని కొంత మంది తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని భిండ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అసిత్ యాదవ్ తెలిపారు. కొందరు వ్యాన్‌లో కూర్చుని ఉండగా, మరికొందరు రోడ్డు మీద నిల్చుని ఉండగా, డంపర్ ట్రక్ వారిని, వారి వాహనాన్ని ఢీకొందని, ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు తర్వాత చనిపోయారని, మరొకరు ఆసుపత్రిలో గాయాలతో చనిపోయారని ఆయన వివరించారు.
గాయపడిన వారిలో 12 మందిని మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా మిగతావారు భిండ్ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. స్పీడుగా వచ్చిన డంపర్ ట్రక్, వ్యాన్‌ను ఢీకొని ఉంటుందని భిండ్ కలెక్టర్ సంజీవ్ శ్రీవాత్సవ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఓ మోటార్‌సైకిల్‌ను ఢీకొనడాన్ని తప్పించే ప్రయత్నంలో డంపర్ ట్రక్, వ్యాన్‌ను ఢీకొని ఉంటుందని ఆయన వివరించారు. ఇదిలావుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు రోడ్డు బ్లాకేడ్ చేశారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.