Wednesday, January 22, 2025

సూసైడ్ స్పాట్‌గా దుర్గం చెరువు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పర్యాటక ప్రాంతంగా రూపొందించిన దుర్గం చెరువు ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలు ఇది నిజమని నిరూపిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం చెరువును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. నగర ప్రజలు రిలాక్స్ కావడానికి దుర్గం చెరువులో బోటింగ్, గార్డెనింగ్, తీగల వంతెనను ఏర్పాటు చేశారు. తీగల వంతెన ఏర్పాటు చెసినప్పటి నుంచి చాలామంది ప్రజలు దానిని చూసేందుకు వెళ్తున్నారు. దీనిని ప్రారంభించిన కొత్తలోచాలామంది నగర ప్రజలు చూసేందుకు సాయంత్రం సమయంలో వెళ్తుండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే వంతెనపైకి కాలినడకన అనుమతిస్తున్నారు.

అంతేకాకుండా వంతెనపై ఎవరూ వాహనాలతో ఆగకుండా కొంత కాలం పోలీసులను ఏర్పాటు చేశారు. దీంతో దీనిపై నగర వాసులు సాధారణ సమయంలో పోవడంలేదు. కానీ ఇటీవలి కాలంలో తీగల వంతెన నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంతో ఓ ఇంటర్ విద్యార్థి తాను చదువులో వెనుక బడ్డానని ఆవేదన చెందిన దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో యువతి కుటుంబ కలహాల వల్ల దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా వెంటనే స్పందించిన పోలీసులు యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు, తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో సూసైడ్ చేసుకునే వారికి స్పాట్‌గా మారుతోందని అనుమానాలు వ్యక్తం అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన నుంచే దూకుడు…
దుర్గం చెరువు మధ్య నుంచి తీగల వంతెనను నిర్మించడంతో దానిపై నుంచి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. సాధారణంగా తీగల వంతెన నుంచి దుర్గం చెరువు అందాలను చూసేందుకు వచ్చారని అందరూ భావిస్తుండగా ఆత్మహత్య చేసుకునేందుకు వస్తున్నారు. అక్కడ ఉంటున్న పోలీసులు, పర్యాటకులు ఆత్మహత్య చేసుకునేవారిని పర్యాటకులుగా భావిస్తున్నారు. కానీ వారు చెరువులోకి దూకే వరకు తెలియడంలేదు. చెరువులో కూడా బురద ఎక్కువగా ఉండడంతో దూకిన వెంటనే బాధితులు అందులోకి వెళ్లి ఊపిరి ఆడకపోవడంతో మృతిచెందుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News