ఇంజిన్‌లోపంతో వెనకకు మళ్లింపు
చెన్నై /న్యూఢిల్లీ : రోజులు గడవక ముందు మరో స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపాలతో వెనకకు మళ్లాల్సి వచ్చింది. చెన్నై నుంచి దుర్గాపూర్‌కు ప్రయాణికులతో బయలుదేరని స్పైస్‌జెట్ విమానం గాల్లో ఎగిరిన తరువాత ఇంజిన్ లోపాలతో మొరాయించింది. పరిస్థితిని గమనించి వెంటనే పైలెట్ అతి చాకచక్యంతో ఎటువంటి ముప్పు తలెత్తకుండా ఈ ఎస్‌జి 331 విమానాన్ని తిరిగి బయలుదేరిన చోటు చైన్నైకు చేర్చారు. మంగళవారం చాలా రాత్రి వేళ ప్రయాణం దశలో ఈ అనుభవం ఎదురైంది. ఇంజిన్ సమస్యలతోనే విమానం ముందుకు సాగలేదని తేలింది. ముంబై దుర్గాపూర్ రూట్‌లో గత వారం బోయింగ్ 737 స్పైస్‌జెట్ విమానం సాంకేతిక సమస్యలతో పలు కుదుపులకు లోనయ్యింది. దీనితో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు.
మొత్తం స్పైస్‌జెట్ల పనితీరు తనిఖీలు : డిజిసిఎ
వరుసగా స్పైస్‌జెట్ విమానాలలో సాంకేతిక లోపాలతో పౌర విమానయాన వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) తీవ్రంగా స్పందించింది. మొత్తం స్పైస్‌జెట్ విమానాల పటాలాన్నిన క్షుణ్ణంగా పరిశీలించి తగు తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపింది. ఇక ముందు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ చర్యలకు దిగారు. వరుస ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు డిజిసిఎ సిద్ధపడింది. స్పైస్‌జెట్ విమానాల బృందంలో మొత్తం 91 విమానాలు ఉన్నాయి. స్పైస్‌జైట్ విమానం దుర్గాపూర్‌లో ఈ నెల 1వ తేదీన దిగుతుండగా కుదుపులకు గురికావడం , ప్రయాణికులకు ఇబ్బంది కలగడం వంటి పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఇది దురదృష్టకరం అని దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రకటన కొద్ది సేపటికే స్పైస్‌జెట్ మరో విమానం ఇంజిన్‌లో వైఫల్యం ఏర్పడింది.