Friday, December 20, 2024

హర్యానాలో బిజెపి హైరానా

- Advertisement -
- Advertisement -

హర్యానాలో బిజెపి సారథ్యపు రాష్ట్ర ప్రభుత్వానికి సంకట స్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి సభలో సరైన బలం లేదని, వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని జెపిపి నేత దుశ్యంత్ చౌతాలా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు. చౌతాలా రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రిగా, జననాయక్ జనతాపార్టీ (జెజెపి)నేతగా ఉన్నారు. గవర్నర్ దత్తాత్రేయకు చౌతాలా ఓ లేఖ పంపించారు. ఇప్పటి రాజకీయ పరిణామాలను గమనించాలని, సభలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం బలం తగ్గిందని, వెంటనే ఈ ప్రభుత్వం బలనిరూపణ జరగాల్సి ఉందని చౌతాలా డిమాండ్ చేశారు. ఇండిపెండెంట్ల మద్దతుతో ఇంతకు ముందు ప్రభుత్వం గట్టెక్కిందని, కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, ఇక ఈ సర్కారు మైనార్టీలో పడిందా? లేదా అనేది గవర్నర్ నిర్థారించాల్సి ఉందని, బలపరీక్షకు సెషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చౌతాలా డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సైనీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు.

దీనితో నిజంగానే ప్రభుత్వం మైనార్టీలో పడింది. తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార అనిశ్చిత నెలకొందని, రాష్ట్రపతిపాలన విధించాలని, మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని పార్టీ డిమాండ్ చేసింది. కాగా తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటామని సిఎం గురువారం కర్నాల్‌లో ప్రకటించారు. తాము మార్చిలోనే సభలో విశ్వాస తీర్మానంలో గెలిచామని, మరోసారి సమయం వస్తే సత్తా నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. దుష్యంత్ చౌతాలాకు ధైర్యముంటే ఆయన బలం ఎంతో చెప్పాలని సవాలు విసిరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత ఎంఎల్ ఖట్టర్ స్పందిస్తూ బిజెపి సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నామని చెప్పారు.

హర్యానా అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90
ఇప్పుడు వాస్తవికంగా ఉన్న సభ్యుల సంఖ్య 88
సభలో బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య 40
కాంగ్రెస్ సంఖ్యాబలం 30
జెజెపి సభ్యుల సంఖ్య 10
ఇండిపెండెంట్లు 6
ఐఎన్‌ఎల్‌డి 1, హెచ్‌ఎల్‌పి 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News