ఈనెల 17వరకు బడులు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు
12 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటన
పాఠశాలలు నిర్వహకులు నిబంధనలు పాటించాలని సూచనలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. నేటి నుంచి ఈనెల 17వరకు పాఠశాలలు మూసివేయాలని 12 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు, 18వ తేదీన నుంచి తిరిగి తెరవాలని పాఠశాల నిర్వహకులకు సూచించింది. గత నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభంకావడంతో విద్యార్ధులంతా బడిబాట పట్టారు. బడులకు మొదటి వారం రోజులు 40శాతం చిన్నారులు హాజరుకాగా, తరువాత క్రమంలో సంఖ్య పెరిగింది. గత ఏడాది కంటే ఈవిద్యాసంవత్సరంలో ప్రభుత్వం బడులకు విద్యార్ధుల సంఖ్య పెరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా కొన్ని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు కరోనా వైరస్ భయంతో తెరవలేదు. దసరా సెలవుల తరువాత తెరిచేందుకు సిద్దమైతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 689 ఉండగా 1.10లక్షల మంది, ప్రైవేటు స్కూళ్లు 1845 ఉండగా 7.25లక్షల మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు.వీరికి దసరా సెలవులు పాఠశాలు ఇవ్వాలని, అదనపు తరగతులు పేరుతో విద్యార్దులకు వేధింపులకు గురిచేయవద్దని సూచిస్తున్నారు.
విద్యాశాఖ నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు తప్పవని మండల విధ్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల ప్రారంభమైన నాటి నుంచి కోవిడ్ నిబంధనలు పాటించకుండా విద్యార్ధులను సెక్షన్ల వారీగా విభజన చేయకుండా 50మందికిపైగా చిన్నారులను ఒకే తరగతి గదిలో చేర్చి అరకొరగా పాఠాలు చెబుతూ విద్యార్ధులను ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి పద్దతులకు స్వస్తి చెప్పాలని, బుధవారం నుంచి ఖచ్చితంగా విద్యార్ధులకు దసరా సెలవులు ఇవ్వాలని సూచిస్తున్నారు. రెండురోజుల కితమే ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులకు సెలువులు ప్రకటించారు. బతుకమ్మ, దసరా పండగను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా జరుపుకుని ఈనెల 18వ తేదీ నుంచి జరిగే పాఠాలకు తప్పకుండా హాజరుకావాలని పేర్కొనట్లు చిన్నారులు చెబుతున్నారు.