Thursday, January 23, 2025

డ్వాక్రా సంఘాల చేతికి ఇక ‘మీ సేవ’

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న మీ సేవ కేంద్రాలకు అదనంగా అవసరమైన ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన మహిళా శక్తి క్యాంటీన్లకు అదనంగా మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను ప్రారంభించనుంది. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటిని మంజూరు చేయనుంది. పలు పథకాలకు తోడుగా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆయా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మరీ వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అర్హత ఉన్న డ్వాక్రా సంఘానికి రూ.2.50 లక్షల వరకు రుణం రూపంలో ఆర్థిక సాయం అందించి, ప్రభుత్వం తరఫున వారధిగా సంఘం మహిళలు మీ సేవా కేంద్రాలను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికల్లా ఈ మహిళా మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించాలని సంకల్పించింది. ప్రస్తుతం పట్టణ, నగర, మండల కేంద్రాలు, మరికొన్ని డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మీ సేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల సేవలు చాలా చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవడంతో పాటు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు, కాలేజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటితో పాటు కరెంటు బిల్లులు, ఇతరత్రా అనేక చలాన్లు చెల్లింపులు వంటివన్నీ మీ సేవ కేంద్రాల ద్వారానే జరుగుతున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాలకు డిమాండ్ ఉంటుంది. ఇందుకు అనుగుణంగా మీ సేవ కేంద్రాలను డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసి, వేగంగా వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభించేందుకు చక చకా పనులు జరుగుతున్నాయి.

మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంచేలా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ కొత్త ఆలోచనలతో ముందుకెళుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను ఆన్‌లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో మాత్రమే అందిస్తున్న ఈ సేవలను ఇకపై ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు తాజాగా నిర్ణయించి మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే డ్వాక్రా సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. డ్వాక్రా సంఘాలకు స్త్రీనిధి ద్వారా రుణసాయం అందించి, ఆగస్టు 15 నాటికి మీ సేవ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,525 మీ సేవ కేంద్రాలు ఉంటే వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సుమారుగా 1500 మీ సేవ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇవి కూడా ఎక్కువగా మండల కేంద్రాల్లోనే పని చేస్తున్నందున ఇప్పుడు ప్రధాన గ్రామాలు కూడళ్ల వద్ద డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 1,500 పంచాయతీ వరకు మాత్రమే గ్రామాల్లో మీ సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ సేవలు, 600కు పైగా ప్రైవేటు సేవల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పట్టణాలు, నగరాల్లోని మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విలేజ్ ఆర్గనైజేషన్స్ పేరిట మహిళా శక్తి మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికార వర్గాల సమాచారం. స్త్రీనిధి ద్వారా మీ సేవ కేంద్రం ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేయడమే కాకుండా అధికారుల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ సామాగ్రి, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేస్తారు.

మీ సేవ కేంద్రాలను ప్రారంభించిన తర్వాత ఆయా డ్వాక్రా సంఘాలు తాము తీసుకున్న రుణాన్ని నెలనెలా కొంత మొత్తం చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాలలు, రైతు వేదికలు, అంగన్వాడీ లేదా ఇతర ప్రభుత్వ భవనాలు ఉంటే వాటి ప్రాంగణాల్లో మీ సేవ కేంద్రానికి అనువుగా ఉన్న వసతిని మీ సేవ కేంద్రానికి కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. డ్వాక్రా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేసి కేంద్రం నిర్వహణ, సేవలకు సంబంధించి వారికి తగిన శిక్షణ ఇస్తారు. మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు పారదర్శకంగా ప్రజలకు సేవలను అందిస్తారు. మీ -సేవ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణకు పర్యవేక్షిస్తారు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరింత బలోపేతం అవుతారని ప్రభుత్వం భావిస్తోంది. అటు ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా అందుబాటులోకి వచ్చి ఎంతో ఉపయోపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News