న్యూఢిల్లీ: ఒక నేరారోపణను నిర్ధారణ చేయడానికి మరణ వాంగ్మూలం ఏకైక ఆధారం అవుతుందని, అందువల్ల అది నిజమైనది, నమ్మదగినదో కాదో కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు మృతి చెందిన వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడు మరణ వాంగ్మూలం ఇచ్చారా, లేక ఎవరి బలవంతం, ఒత్తిడి వల్ల ఇచ్చారా అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఒక వేళ ఒకటికన్నా ఎక్కువ మరణ వాంగ్మూలాలు ఉండి, వాటి మధ్య తేడాలు ఉన్న పక్షంలో మేజిస్ట్రేట్ లాంటి ఉన్నత స్థాయి అధికారి రికార్డు చేసిన మరణ వాంగ్మూలంపై ఆధారపడవచ్చని కూడా న్యాయస్థానం పేర్కొంది. అయితే దాని వాస్తవికత విషయంలో ఎలాంటి అనుమానాలు తలెత్తే పరిస్థితి లేని షరతుతో మాత్రమే ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత శిక్షాస్మృతి(ఐపిసి) సెక్షన్ 304బి( వరకట్నం మృతి) కింద దోషిగా నిర్ధారించబడిన ఒక వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ ,హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసుకున్న అపీలు విచారణ సందర్భంగా కోర్టు ఈ వాఖ్యలు చేసింది. ఈ కేసులో మృతురాలు రెండు మరణ వాంగ్మూలాలు ఇచ్చింది. మొదటి వాంగ్మూలంలో తాను పొరబాటున విషపూరితమైన మందును సేవించినట్లు పేర్కొనగా, రెండో వాంగ్మూలంలో భర్త, అతని తల్లిదండ్రులు తనకు బలవంతంగా విషపదార్థాన్ని తాగించారని పేర్కొంది. అయితే ఈ రెండు మరణవాంగ్మూలాలు ఒకేలా లేవని పేర్కొంది.
Dying declaration must be true: SC