రామజన్మభూమికి తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఉపయోగించదలచిన ప్రత్యేక గులాబీ రంగు రాయి(పింక్ శాండ్‌స్టోన్) లభ్యతకు అవరోధాలు ఇక తొలగిపోయినట్లే. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బన్సీ పహార్‌పూర్ ప్రాంతంలో మాత్రమే లభించే ఈ పింక్ శాండ్‌స్టోన్‌ను గనులను ఆన్‌లైన్‌లో వేలం వేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు.
బంధ్ బరేతా అభయారణ్యానికి చెందిన 398 ఎకరాలను పింక్ శాండ్‌స్టోన్ మైనింగ్ కోసం మార్చడానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించడంతో మైనింగ్ బ్లాకుల వేలంకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. పింక్ శాండ్‌స్టోన్ మైనింగ్ కోసం త్వరలోనే దాదాపు 70 మైనింగ్ బ్లాకులు రూపొందిస్తామని, వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 500 కోట్ల ఆదాయం సమకూరగలదని అదనపు చీఫ్ సెక్రటరీ(గనులు, పెట్రోలియం) సుబోధ్ అగర్వాల్ తెలిపారు. అయోధ్యలోని రామాలయంతోపాటు ఇతర నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున బిల్డర్లు పోటీపడుతున్న పింక్ శాండ్‌స్టోన్ ఇక చట్టబద్ధ మైనింగ్ ద్వారా అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పింక్ శాండ్‌స్టోన్ మైనింగ్ 2016లో అధికారికంగా నిషేధించినప్పటికీ నల్ల బజారులో ఈ రాయి చట్టవిరుద్ధంగా లభిస్తోంది.