మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డిజిపి డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రంలోని రేంజ్ ఐజిలు, డిఐజిలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పిలతో మంగళవారం డిజిపి మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ కమీషనర్లు, ఎస్పిల నుండి డిఐజి స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని అన్నారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులుతమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యే విధంగా చూడాలన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని అన్నారు.
అదేవిధంగా, మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని తెలియచేసారు. కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం సెల్ఫోన్లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం తో పాటు ఐపిసి ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ-పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్పిలు పాసులను జారీ చేస్తారని స్పష్టం చేశారు.
ఇ-పాస్ ద్వారా అత్యవసర పాసులు జారీ
రాష్ట్రంలో బుధవారం నాటి నుండి పదిరోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఇ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డిజిపి ఎం. మహేందర్ రెడ్డి తెలియ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఇపాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పిలు మాత్రమే పాస్‌లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్‌లు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్నవెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని తెలిపారు.
E- Pass must for travel in Telangana: DGP Mahendar Reddy