Monday, December 16, 2024

రేషన్ కార్డుతో ‘ఈ -శ్రమ్’ కార్డు అనుసంధానం

- Advertisement -
- Advertisement -

అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వ యోచన

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం రేషన్ కార్డుతో ‘ఈ -శ్రమ్’ కార్డును అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ‘ఈ శ్రమ్- యోజన’ స్కీమ్ ను ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ఈ శ్రమ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కార్మికులకు ‘ఈ-శ్రమ్’ ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమాను అమలు చేస్తోంది.

రాష్ట్రంలో ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 2024 నవంబర్ నాటికి 42,91,138 మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2025 నాటికి కోటి రిజిష్ర్టేషన్లు అధగమించేందుకు కార్మిక శాఖ ప్రణాళికను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 28 కోట్ల ఈ -శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర కార్మిక భీమా సంస్థ వర్గాల సమాచారం. ఈ స్కీమ్‌లో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ముఖ్య కారణం భవన నిర్మాణ రంగంలో ఉన్న వారిని ఆదుకోవడం. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారు.

వీరికి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అమలయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇటువంటి వారి కోసం ‘ఈ-శ్రమ్’ ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమాను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రూ.2 లక్షలు, మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, పాక్షిక వికలాంగత్వానికి రూ.లక్ష, 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్, కార్మికులకు పని ముట్లు, కుట్టు మిషన్లు, కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్లు, ఇతర ఆర్థిక సహాయం వంటివి ఒనగూడుతాయని తెలిపింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలనుకునే వారు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News