Monday, December 23, 2024

జనరేషన్ గ్యాప్: కొన్ని పరిష్కారాలు

- Advertisement -
- Advertisement -

‘Each generation has its own idiosyn crasies, preferences, management styles and personal goals, which can lead to misunderstandings and even conflict at work’ Worldwide Interim Leadership Group
బోధన నామమాత్రపు వృత్తి కాదు, ఒక తరాన్ని తీర్చిదిద్దే విధానం, పరిపూర్ణత సాధిస్తే అది ఒక కళ. తొలుత అడుగిడిన ఆశయ సంపన్నుడికి సుదీర్ఘ ప్రయాణం. దారితప్పిన వాళ్లకు అధ్యాపనం ప్రయాస. అనుభవం గడించిన కొద్దీ గురువులు శిష్యులకు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించగలుగుతారు. గురుశిష్యులు ఏకమైతే లోకాన్ని ఏ రూపం అనుకుంటే ఆ రూపంలోకి మార్చగలరనేదానికి చరిత్రలో ఉదాహరణలెన్నో. అయితే,టీచర్లతో విద్యార్థులకు ‘జనరేషన్ గ్యాప్’ అనే సమస్య తలెత్తే ప్రమాదం ఒకటి పొంచి వుంటుంది.

తరగతి గదిలో తనకు ఎదురుగా కూర్చున్న పిల్లలకు తనకూ మధ్య గల ‘జనరేషన్ గ్యాప్’ ను అధిగమించడమనేది అధ్యాపకులకుండాల్సిన వివేకం, పాటించాల్సిన జాగరూకత కూడా. సరళంగా చెప్పవలసివస్తే జనరేషన్ గ్యాప్ అంటే ఒక తరానికి మరొక తరానికి మధ్య ఆలోచనలు అభిప్రాయాల్లో గల వ్యత్యాసం, ప్రవర్తనలోగల తేడా. దీని పరిష్కారం అనుకున్నంత సులువేం కాదు. భావనల్లో, వైఖరులలో, అనుభవాలలో, అభిప్రాయాలలో, అలవాట్లలో, ప్రవర్తనలో సాధారణంగా సమ వయస్కుల మధ్యనే బోలెడన్ని తేడాలు కనిపిస్తుంటాయి. ఈ తేడాల వల్లనే ఒకరినొకరు విభేదిస్తూ ఉండటం చూస్తుంటాం. మరి అలాంటప్పుడు పెద్దవాళ్లకూ పిన్న వయస్కులకూ నడతలో హావభావాల్లో తేడాలుండటంలో ఆశ్చర్యమే లేదు. వయో వ్యత్యాసం వల్ల పిల్లలు పెద్దల మధ్య వైమనస్యం, సంఘర్షణ, శత్రుత్వం ఏర్పడతాయి. తాత్సారం చేస్తే ముదిరిపాకాన పడి అనర్థాలు జరిగిపోతాయి జనరేషన్ గ్యాప్ ఇంట్లో, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో, విద్యాలయాల్లో కనపడని అగాథాలు సృష్టిస్తుంది . ఇంకా చెప్పాల్సివస్తే పరిస్థితులు నిరసన, ప్రతిఘటన దాకా వెళ్తున్నాయి.

జనరేషన్ గ్యాప్ కొనసాగిన చోట పురోగతి, వికాసం ఉండవు. పండితులు ‘పరంపర’ అని ప్రశంసించే సంప్రదాయాలు కొండొకచో సమాజానికున్న ఔన్నత్యమూ అప్పటిదాకా పాటింపులో ఉన్న విలువలు నైతికతలు ఒక్కసారిగా మంటగలుస్తాయి. సంఘంలో అంతర్గత విచ్ఛిత్తి మొదలవుతుంది. వ్యవస్థలన్నీ స్తంభించి, అతలాకుతలం అవుతాయి. జనరేషన్ గ్యాప్ మూలాన గురుశిష్య సంబంధాల్లో కృత్రిమత్వం అసహజత్వం జొరబడి సమాజాభివృద్ధికి అమితంగా దోహదపడే ‘విద్యారంగం’ పూర్తిగా కుంటువడుతుంది. జనరేషన్ గ్యాప్ పరిష్కార ప్రయత్నాలు మొదలు కావాల్సిందే విద్య నుండి. టీచర్లు యువతకు తెలివిడి అలవరచడం నుండే.

లేదంటే సమాజానికి మహా విపత్తే సంభవించగలదు. జనరేషన్ గ్యాప్ చిట్టచివరకు భావజాల సంక్షోభానికి దారితీస్తుంది.మానవాళి ఎదుర్కొనే సమస్యలన్నీ ఒక ఎత్తు, ఐడియాలజీ క్రైసిస్ ఒక ఎత్తు. ఇప్పుడు ఐడియాలజీ క్రైసిస్ సమాజం ద్వారా తరగతిగదినీ పీడిస్తోంది. జనరేషన్ గ్యాప్, భావజాల సంక్షోభం ఈ రెండు సమస్యలకు చికిత్స జరగని పక్షంలో ప్రవాస భారతీయ రచయిత దక్ష్ త్యాగీ తన రచన ‘ఏ నేషన్ ఆఫ్ ఇడియట్స్’ లో ఉటంకించిన దారుణాలను మించిన దుస్సంఘటనలు మరెన్నో దేశంలో జరుగుతాయి. ప్రతి 17 నుండి 18 ఏళ్ళకు ఒక తరం అనుకుంటే ఇప్పుడు భూమి మీద ఏడు తరాలు ఒక సమయంలో నివసిస్తున్నారు. వీళ్లనే జన్మించిన కాలాన్ని బట్టి జనాభా అధ్యయన శాస్త్రం- సైలెంట్ జనరేషన్ (1924-1945), బేబీ బూమర్స్ (1946–1964), ఎక్స్ జనరేషన్ (1965–1980), మిలీనియల్స్ (1981–1996), జడ్ జనరేషన్ ( 1997–2012), జనరేషన్ ఆల్ఫా ( 2013–2025) అంటూ నిర్వచించింది.

ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఉపాధ్యాయులు ‘బేబీ బూమర్స్, ఎక్స్ జనరేషన్, మిలీనియల్స్’ మూడు తరాలుగానూ, విద్యార్థులు ‘జడ్, ఆల్ఫా జనరేషన్’లో ఏదో ఒక తరంగానూ మొత్తం నాలుగు తరాలు విద్యాసంస్థల్లో మనకు కనపడతారు. టీచర్లూ, లెక్చరర్లూ, ప్రొఫెసర్లూ పిల్లలను అర్థం చేసుకోవడం, అర్థమయ్యేట్టు చెప్పడం అటుంచితే, పిల్లలే మూడు రకాల మనస్తత్వాలున్న పంతుళ్లను అర్థం చేసుకోవాల్సుంటుంది. ఇది పెద్దగా బోధనాశాస్త్రంలో చర్చకు రాదు, కాని పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంతో పాటు సర్వీసు రీత్యా మూడు వయో వర్గాలుగా తమ మధ్యనున్న ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అణకువ ప్రదర్శిస్తుంటారు. చదువు తప్పనిసరి కావటాన టీచర్ల శారీరక, మానసిక ప్రకృతులతో సహనం వహిస్తుంటారు. కేవలం ఉపాధ్యాయుల తీరుతెన్నుల వల్లనే చదువు మానేస్తున్నవాళ్లు లేకపోలేదు.
ఉపాధ్యాయుడు కాంటెంట్ డెలివరర్ మాత్రమే కాదు, కాలానికి కాన్సెప్టుకూ ప్రతినిధి. కాలం అంటే తను పుట్టి పెరిగిన స్థలం, పరిస్థితులు. కాన్సెప్టు అంటే పుట్టి పెరిగిన స్థలం, పరిస్థితులు తనకు అలవరచిన లేదా తాను అలవరచుకున్న ఆలోచనలు, అభిప్రాయాలు, అభిమతం ఆచరణలు. కాలమూ కాన్సెప్టూ విద్యార్థులకూ వర్తిస్తుంది కాబట్టే జనరేషన్ గ్యాప్ పెద్ద సమస్య అయి కూచుంది. ‘అర్థం కోసం అన్వేషించే జీవి మనిషి, మానవ ప్రవర్తన ప్రధానంగా కోరికలు భావోద్వేగం, జ్ఞానం అనే మూడు విషయాల నుండి బహిర్గతమవుతుంది’ అంటాడు సోక్రటీస్.

ఇప్పటి పిల్లల అన్వేషణ, కోరికలు, భావోద్వేగాలు, జ్ఞానం వేరు. గత అర్ధ శతాబ్దికి చెందిన తమ ఉపాధ్యాయుల అన్వేషణ కోరికలు, భావోద్వేగాలు, జ్ఞానం వేరు. ఇక్కడే విద్యార్థుల ఉపాధ్యాయుల అభిప్రాయాల్లో ఆచరణలో అభీష్టాల్లో పోలిక పొంతనలేని తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో మేధావులుగా ఉపాధ్యాయులే జనరేషన్ గ్యాప్‌ను పరిష్కరించేందుకు పూనుకోవాలి. పిల్లలతో ఏ స్థాయిలోనైనా ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన మార్గాన్ని గురించి ప్రఖ్యాత సాహిత్యవేత్త జార్జి బెర్నార్డ్ షా ‘జీవితం నాకు ఓ చిన్న కొవ్వొత్తి కాదు. ఇది ఒక రకమైన అద్భుతమైన టార్చ్, ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది. భవిష్యత్ తరాలకు దానిని అందించడానికి ముందు నేను దానిని వీలైనంత ప్రకాశవంతంగా వెలిగించాలని అనుకుంటున్నాను’ అంటాడు. పౌరుల తయారీలో ఉపాధ్యాయులెట్లా ఉండాలనే దానికి మీకీ విషయం మనవి చేస్తున్నాను.

తనను ఉరితీసే రోజున షహీద్ భగత్ సింగ్ లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాడట. ఆ అజరామర త్యాగపురుషుడు భగత్ సింగ్ పవిత్ర హస్తాలు విడిచిన తదుపరి పుటలను చదువగల యువత ఇప్పుడు దేశానికి కావాలంటాడు పంజాబీ కవి స్వర్గీయ అవతార్ సింగ్ పాష్. బహుశా సమాజాన్ని భావజాల సంక్షోభం నుండి పరిరక్షించేది ఉపాధ్యాయులే, బెర్నార్డ్ షా చెప్పిన టార్చి బేరర్ లాంటి ఉపాధ్యాయులే. పిల్లల్లో ఎన్ని వింత పోకడలున్నా భారమైనప్పటికీ ఎట్టి పరిస్థితిలోనూ ఉపాధ్యాయులు గురతరమైన శిక్షణా బాధ్యతల నుంచి వైదొలగరాదు. విల్ గ్రూపు చెపుతున్నట్టు ప్రతి తరానికి దాని స్వంత ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు, నిర్వహణ శైలులు వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయి, కనుకనే పనిలోనూ భావనల్లోనూ అపార్థాలు సంఘర్షణలు జనిస్తుంటాయి. నానాటికీ పెరుగుతున్న జనరేషన్ గ్యాప్‌తో విద్యార్థులు ఉపాధ్యాయులు తరాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకై ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు పరస్పరం విమర్శించుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది.

పిల్లలేమో టెక్నాలజీ శరవేగంగా దూసుకెళ్తున్న తరం నుండి వచ్చారు, తామనకున్న ప్రాధాన్యతల్లో మున్ముందుకెళ్లడమే వాళ్ల దినచర్య.ఉపాధ్యాయులేమో రేడియోను వింటూ నలుపు తెలుపు టివిలను చూస్తూ కాలిబాటల్లో పెరిగిన పాదచారులు సైకిలిస్టులు. నిజానికి స్మార్ట్ ఫోన్‌లలో తల దూర్చి ఒటిటిల్లో కేరింతలకు అలవాటుపడ్డ కౌమార్యంతో వేగడం కష్టంగానే ఉంటుంది. తప్పదు, ఇక్కడే గురుశిష్యులిద్దరూ సహభాగితంగా నడచుకోవాల్సుంటుంది. ఇందులో మొదటిది: కాంప్లిమెంటరీ మెథడ్. ఒకరికొకరు బహుమతి ఇచ్చుకున్నట్టుగా పిల్లల నవ్యతను మెచ్చుకుంటూ ప్రాచీనతను అంగీకరింపచేయడం. రెండోది: పరస్పరం మెంటార్ మెంటీగా ఉండటం. తమకు తెలియని టెక్నాలజీ విషయంలో పిల్లల సాయం తీసుకోవడం, తామెరిగిన గతంలోని ఉత్తమ విలువలను పిల్లలకూ అందివ్వడం.

మూడోది: ఆహారం, ఆహార్యం, అలవాట్ల విషయంలో కించపరచడం మానుకొని ఆమోదించడం, గౌరవించడం. పెడ ధోరణి ఉంటే ప్రాక్టికల్‌గా నష్టాలను విడమరచి సరిచేయడం. నాల్గోది: సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం, విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధికై సహకార పద్ధతిన ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు విహార యాత్రలు నిర్వహించడం. ఐదోది: వాదన కంటే పిల్లలను స్నేహపూరితంగా అర్థం చేసుకునేందుకు గల అన్ని అవకాశాలను ఉపయోగించుకొని పిల్లలతో కలసిపోవడం వంటి మృదు నైపుణ్యాలతో జనరేషన్ గ్యాప్‌ను అధిగమించవచ్చు. ప్రముఖ ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ లిండా గోర్వెట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ నిపుణురాలు రాబిన్ ట్రక్మార్టన్ సంయుక్తంగా రాసిన ‘Bridging the Generation Gap: How to Get Radio Babies, Boomers, Gen-Xers and Gen-Yers to Work Together and Achieve More’ గ్రంథంలోని ‘Point- Counterpoint’ స్ట్రాటజీ అమోఘంగా పని చేయగలదు.

ఇతర ప్రతిపాదనలు ఉపాధ్యాయులకు ఉపయోగపడగలవు. సోషల్ మీడియా వల్ల కావొచ్చు, పెరిగిన హ్యూమన్ మొబిలిటీ వల్ల కావొచ్చు, వివిధ ఛానెళ్లు పుక్కిలిస్తున్న వక్రానందం అపహాస్యం ఇతరేతర కారణాలేవైనా కావొచ్చు విశృంఖలత జడలువిచ్చి యువత వేలం వెర్రిగా ఊగిపోతుంది. ఈ విపత్కర సమయంలో రూల్‌బుక్ లా కాకుండా ఉపాధ్యాయులు తమను తాము తాజా పరచుకుంటూ విద్యార్థులతో ఫ్రెండ్లీగా మార్పునకు ప్రయత్నించాలి. సమయ పాలన, నాణ్యమైన బోధన, నిజాయితీ, అనురాగం, ఆప్యాయతలతో విద్యార్థుల్లో సానుకూలంగా అంతరాలను తగ్గించుకోవచ్చు. మరీ ముఖ్యంగా కొత్తతరంతో మమేకమయ్యేందుకు ఉపాధ్యాయులందరికీ నిరంతర అధ్యయనం, శిక్షణ తప్పనిసరి. పిల్లల్లో బలమైన ఊహను అభివృద్ధి చేయడం, లక్ష్య సాధనకు ఎల్లవేళలా దన్నుగా ఉండడం, ఠీవి మర్యాద ఉట్టిపడే వస్త్రాలతో పాటు ఉత్సాహం అభిరుచిని ఒంటికి ధరించిన నిబద్ధతగల ఆచార్యులే ఈ సహస్రాబ్ద్యనంతర ఛాత్ర కోటికి నిత్యావసరం. పిల్లల భావోద్వేగాలను వైఖరులను పసిగట్టి దేశానికి అక్కరకు రాగల పౌరులుగా విద్యార్థులను మలచడానికి జనరేషన్ గ్యాప్ విషయమై సంపూర్ణ అవగాహనే ఉపాధ్యాయులకు ఇవాళ ఉండాల్సిన అసలైన అదనపు అర్హత.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News