మే నెలలో ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశం
జాతీయ ప్రవేశ పరీక్షలు, కొవిడ్ పరిస్థితులను
పరిశీలించి సెట్ల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) జూన్ నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెలలో ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో జూన్‌లో ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు జెఇఇ మెయిన్, నీట్ వంటి జాతీయ పరీక్షల షెడ్యూల్ విడుదల కాలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశంలో కొవిడ్ పరిస్థితుల దృష్టా జాతీయ పరీక్షల షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు, జాతీయ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే ఆయాకు సెట్లకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఈ నెల 30 వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అన్ని విషయాలను పరిశీలించి ఫిబ్రవరిలో సెట్ల తేదీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపధ్యంలో అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలను చూసుకుని తేదీలు ఖరారు చేయనున్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఎంసెట్‌ను గత గతంలో మాదిరిగానే కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నెల తర్వాత అంటే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.
ఆలస్యంగా ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు ఆలస్యంగా జరగడంతో పాటు తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన జనవరి ముగుస్తున్నా ఇంకా కొన్ని కోర్సులకుసంబంధించిన ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు. ఇటీవల సిపిజిఇటి, ఎడ్‌సెట్, లాసెట్ తుది విడత సీట్లు కేటాయించగా, పిజి, బి.ఇడి, లా కోర్సులకు సంబంధించి స్పాట్ అడ్మిషన్లు, యాజమాన్య కోటా సీట్లు భర్తీ కావాల్సి ఉంది. కౌన్సెలింగ్ ఆలస్యంగా జరగడంతో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొదటి సెమిస్టర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ జరుగనుంది. ఆగస్టు, సెప్టెంబర్ చివరి నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తయితే అక్టోబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.