ఈసారి ఎంసెట్‌కు పెరుగనున్న విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 1.80 లక్షలు దాటాయి. శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 1,80,142 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,14,576, అగ్రికల్చర్ విభాగానికి 65,566 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. జులై 14,15 తేదీలలో అగ్రికల్చర్ ఎంసెట్ జరుగనుండగా, జులై 18,19,20 తేదీలలో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష జరుగనుంది.
ఇక నుంచి ఎంసెట్ ద్వారానే నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2022 – 23) నుంచి ఎంసెట్ ద్వారా బిఎస్సి నర్సింగ్ కోర్సుకు ప్రవేశాలు జరగనున్నాయి. ఎంసెట్‌లో బైపిసి విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, బిఎస్సి నర్సింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇంటర్ మార్కుల ఆధారంగా బిఎస్సి నర్సింగ్ కోర్సులో ప్రవేశాలను చేపడుతుండగా, తాజా మార్పుతో ఇక నుంచి ఇంజినీరింగ్,ఫార్మసీ, మెడిసిన్ కోరుల తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ఎంసెట్ ర్యాంక్‌ల ద్వారానే సీట్లను భర్తీ చేయనున్నారు.
ఈసారి ఎంసెట్‌కు పెరుగనున్న దరఖాస్తులు
ఎంసెట్‌కు ఈసారి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల నుంచి 2.50 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో 90 శాతం వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులే ఉండనున్నారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962 మంది, అగ్రికల్చర్‌కు 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి గతేడాది కంటే దరఖాస్తులు పెరుగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎంసెట్ ద్వారానే నర్సింగ్ ప్రవేశాలు చేపడుతుండటం, ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేయడం వంటి కారణాలతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.