మే 9 నుంచి 12 వరకు పరీక్షలు
ఇఎపి సెట్‌గా మారిన ఎంసెట్
26 నుంచి దరఖాస్తుల స్వీరకణ మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపిసెట్‌గా మారిన ఎంసెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (టిఎస్‌ఇఎపిసెట్) నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఇఎపిసెట్ కన్వీనర్ డీన్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, వైఎస్ చైర్మన్ ఎస్‌కె మహమూద్, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి, ఇఎపిసెట్ కన్వీనర్ డీన్ కుమార్ సహా పలువురు హాజరయ్యారు. ఈ నెల 21న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కన్వీనర్ డీన్‌కుమార్ ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఎంసెట్ పరీక్ష పేరును ప్రభుత్వం ఇటీవల ఇఎపిసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
ఇఎపిసెట్ పరీక్ష షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల 2024 ఫిబ్రవరి 21
దరఖాస్తుల స్వీకరణ 2024 ఫిబ్రవరి 26 నుంచి
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 024 ఏప్రిల్ 6
పరీక్షల నిర్వహణ 2024 మే 9 నుంచి 12 వరకు
మార్చి 12న పిజిఇసెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎం.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిజిఇసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు టిఎస్‌పిజిఇసెట్ షెడ్యూల్‌ను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. మార్చి 16 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నట్లు పిజిఇసెట్ కన్వీనర్ ఎ.అరుణకుమారి తెలిపారు. జూన్ 6 నుంచి 9 వరకు పిజిఇసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.