Saturday, December 21, 2024

సీజనల్ వ్యాధులుపై ముందస్తు చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్, కీటకజనిత వ్యాధుల నిర్మూలనకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో జిల్లాలో డయేరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి ఏ ఒక్క కేసు కూడా నమోదు కా కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కోవిడ్ సమయంలో జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యల మాదిరిగానే ఈ సీజన్‌లో ప్రజలను చైతన్య పరుస్తూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లోని పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రార్ధనా సమయంలో వివరించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలు, అధికారులపై ఉంటుందన్నారు. విద్యార్థులకు వర్షాకాల సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హ్యండ్ వాష్ గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా స్థాయి అధికారులు వారి ఆధీనంలోని పాఠశాలలు, వసతి గృహాల అధికారులతో జూమ్ సమావేశాలు నిర్వహించి వివరించాలన్నారు. విద్యార్థులకు వేడి భోజనం, వేడి త్రాగు నీరు అందించాలని సూచించారు. విద్యా సంస్తలు, హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. మండల స్థాయి అధికారుల క్షేత్ర పర్యటనలు చేసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. దోమల నిర్మూలనకు పిచికారి చేయాలని, దోమలు వ్యాప్తి చెందకుండా నీటి నిల్వలను తొలగించాలన్నారు.

గృహాల్లో పూలకుండీలు, కూలర్లు, కొబ్బరి బొండాలు, టైర్లు, ట్యూబ్‌లలో నీటి నిల్వలను తొలగించాలని, డ్రైడే, ప్రైడే కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధాకారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ, గత సంవత్సరం వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదయ్యాయని, ఈ సంవత్సరం జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాకుండా, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైడే, ప్రైడే కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి సీజనల్ వ్యాధులపై గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మున్సిపల్ కమిషనర్, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేశ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి సాయిబాబా, జిల్లా పౌరసంబంధాల అధికారి భీమ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News