Monday, January 20, 2025

అగ్నిగుండంలా భూగోళం

- Advertisement -
- Advertisement -

వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని, మిగతా మూడు సంవత్సరాల్లోని రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కీలకమైన భూతాప పరిధి 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయి దాటే ప్రమాదం కనిపిస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా అంచనా వేసింది. పారిశ్రామిక విప్లవం నాటి సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా జాగ్రత్త పడాలని 196 దేశాలు లక్షంగా పెట్టుకున్నా ఈసారి మండుతున్న ఎండలను చూస్తుంటే భయాందోళనలు కలుగుతున్నాయి. 2030 లోపుగానే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పరిధి దాటిపోవచ్చునేమో అన్న భయం శాస్త్రవేత్తల్లో కలుగుతోంది. ముఖ్యంగా ఈ మే నెలలో ఎదురైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 44.2 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు గత పది రోజులుగా నమోదవుతున్నాయి.

తెలంగాణలో పగటిపూట 45.2 డిగ్రీల వరకు నమోదవుతుండగా, మే 17న ఒక్కరోజు లోనే 46.4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ఈనెల 19న 42.5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదైంది. ఈనెల 14న కూడా 42.1 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత చూపించింది. ఈ వేడిమికి భూతాపం, ఎల్‌నినో ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా భారత్‌లో ఏటా దాదాపు 84 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి మూడేళ్లకు ఏప్రిల్ మే నెల మధ్యకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం చూస్తున్నాం. 19902019 మధ్య వేసవి కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 9 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగాయి.అయితే 2021 2050 మధ్యకాలంలో వంద జిల్లాల్లో 2.3 నుంచి 6 డిగ్రీలసెంటిగ్రేడ్ వరకు ,

465 జిల్లాల్లో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 2 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో 4 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈలోగా తేమ తీవ్రతరమై ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనేక పట్టణాల్లో 32 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 43 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటితే వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఏప్రిల్ 18న అత్యధికంగా 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యా యి. ఏప్రిల్ 16న ఒక్కరోజులోనే ముంబైలో వడదెబ్బకు 13 మంది మృతి చెందారు. 60 మంది అస్వస్థులయ్యారు. దైనందిన జీవితాలపై వడగాడ్పులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని గంటలైనా ఆరుబయలు ప్రాంతాల్లో పనిచేయలేకపోతున్నారు. ఈ విధంగా వడగాడ్పుల వల్ల 2030 నాటికి దేశంలో 5.8 శాతం వరకు పనిగంటలు తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి.
2022 ఏప్రిల్‌లో రికార్డ్ స్థాయిలో అసాధారణ ఉష్ణోగ్రతలు ఎన్నో అనర్థాలను తెచ్చిపెట్టాయి. దాదాపు 90 శాతం మంది తమ మనుగడ సరిగ్గా సాగక, ఆదాయం కోల్పోయి, దారిద్య్ర పరిస్థితుల్లో ఆకలి మంటలకు గురయ్యారని నివేదికలు చెబుతున్నాయి. గర్భస్థ శిశువులపై కూడా వడగాడ్పులు విపరీత ప్రభావం చూపాయి. పుట్టకుండానే తల్లికడుపులోనే కన్నుమూసిన సంఘటనలు ఎన్నో ఉన్నా యి. 122 సంవత్సరాల తరువాత అత్యంత వేడి సంవత్సరంగా 2022 రికార్డు కెక్కింది. మళ్లీ ఈ ఏడాది 60 శాతం భారతం సాధారణ వేడి కన్నా రికార్డుస్థాయిలో వేడిని ఎదుర్కొంటోంది. 2010 మే నెలలో అహ్మదాబాద్ పశ్చిమభాగాన ఉష్ణోగ్రతలు 47.8 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటడంతో నవజాత శిశువులు 43 శాతం మంది ఆస్పత్రిపాలు కావలసి వచ్చింది.

దేశం మొత్తం మీద ఇక్కడ ఉష్ణకార్యాచరణ ప్రణాళికను ఆనాడు తయారు చేయవలసి వచ్చింది. అత్యవసర చర్యలు చేపట్టడంతో ఆనాడు వేలాది మందిని కాపాడగలిగారు. 2015లో వడగాడ్పుల వల్ల 2330 మంది ప్రాణాలు కోల్పోయారు. వడగాడ్పుల మరణాలను నివారించడానికి రాష్ట్రాలు తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆనాడు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయవలసి వచ్చింది. ఉష్ణకార్యాచరణ ప్రణాళిక సరిగ్గా అమలు కాకుంటే అత్యధిక వేడి వల్ల దేశంలో 2050 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్షం దెబ్బతింటుంది. ప్రాణాంతక ఉష్ణోగ్రతలకు భారత్ ఎంత వరకు బలహీనమవుతోందో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా వాస్తవంగా బాధితులవుతున్నవారికి సరైన న్యాయం కానీ సాయం కానీ అందడం లేదు.
మేలైన జీవనం కోసం ఏటా కొన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసపోతున్నారు. కానీ ఇక పట్టణాల్లో భరించలేని ఉష్ణోగ్రతలకు జనం ఉండలేకపోతున్నారు. ఉదాహరణకు ఢిల్లీలోని 32 మిలియన్ మంది 2022లో వడగాడ్పులకు నరకయాతన అనుభవించారు. వలస వచ్చే వారిలో అత్యధిక జనాభా మురికివాడల్లో నివసిస్తుంటారు. వీరికి తమ నివాసాల్లో ఎలాంటి చల్లదనం కలిగించే సదుపాయా లు ఉండవు. ఆరుబయలు ప్రాంతాల్లో, నిర్మాణాల్లో పనిచేసే కార్మికులు అత్యధిక వేడి వడగాడ్పులు భరించలేక ఏడాదికి 162 పని గంటలు కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కార్మిక శక్తిలో దాదాపు 50 శాతం తమ పనిగంటల్లో అత్యధిక వేడికి గురవుతున్నారు. సాధారణ రైతులు, నిర్మాణరంగ కార్మికులు, వీధుల్లో బండ్లపై అమ్ముకునే చిల్లర వ్యాపారులు తమ జీవనం సాగక అల్లాడిపోవలసి వస్తోంది.
ఈ విషయంలో చండీగఢ్ నగరాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అక్కడ వాతావరణానికి అనుకూలమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రెండు నదుల పరీవాహక ప్రాంతాల మధ్య కొండల దిగువ భాగాన ఈ నగరం విస్తరించింది. సిటీ మాస్టర్ ప్లాన్‌లో సహజమైన పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. నగరం చుట్టూ మామిడి తోటలు వేశారు. నగరానికి చల్లదనం కలిగించేలా సుఖనా సరస్సును సృష్టించేందుకు చిన్న నదికి ఆనకట్ట కట్టారు. పెద్దపెద్ద భవనాల చెంత చిన్న నీటి కొలనులను అభివృద్ధి చేశారు. ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ప్రాంతంలో పార్కులను ఏర్పాటు చేశారు. భారీగా అటవీ ప్రాంతాలను రిజర్వు చేశారు. వాతావరణానికి అనువైన నిర్మాణాలు జరిగేలా మట్టి ఇళ్లు వంటివి స్థానిక నిర్మాణాలకు నమూనాగా ఉంచారు. అయితే రానురాను ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పులు వంటివి నగరంపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏదేమైనా అంతర్లీన రూపకల్పన సూత్రాలు నగరానికి కొంతవరకు ఊరట కలిగిస్తున్నాయి.
విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో గత ఏడాది గోధుమ దిగుబడి బాగా తగ్గింది. ఈ తగ్గుదల అరవై ఏళ్ల క్రితం 2.2 శాతం వరకు ఉండగా, ఇప్పుడు 8 శాతానికి చేరింది. ఉదాహరణకు దేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అయ్యే జీలకర్ర సాగులో 90 శాతంపై ఈ ప్రభావం పడి ఉత్పత్తి బాగా దెబ్బతింది. వ్యవసాయంలో నష్టాలు, చివరకు దుర్భిక్ష పరిస్థితులు వెంటాడి రైతుల మరణాలకు దారి తీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతుంటే రానున్న ఏడేళ్లలో జిడిపిలో 2.5 శాతం నుంచి 4.5 శాతం వరకు భారత దేశం నష్టపోవలసి వస్తుందని మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది.

2023 24 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 332 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనుకున్న లక్షాలను సాధించలేని దుస్థితిని తీసుకొస్తున్నాయి. వ్యవసాయం అనేది ఇతర రంగాల కన్నా వాతావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. పర్యావరణం మార్పులుతో తెగుళ్లు పుట్టుకొచ్చి సుదీర్ఘకాలం వెంటాడుతున్నాయి. అత్యధిక వేడి కారణంగా మరో సమస్య కూడా ఎదురవుతుంది. నీటి ద్వారా కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువౌతాయి. శ్వాసకోశ, హృదయ కోశ వ్యాధులతో పాటు మధుమేహం, మూత్రపిండ వ్యాధులు కూడా దాపురిస్తుంటాయి. సామాజిక దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. పని చేసే సామర్ధం కోల్పోవడం, కార్మికశక్తి కరువు కావడం. విద్యుత్ కొరత పీడించడంతో సకాలంలో వైద్య చికిత్స అందకపోవడం ఇవన్నీ అనర్ధాలను తెచ్చిపెడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News