ప్రపంచంలో ముఖ్యంగా మనదేశంలోని నేలతల్లి విషకాలుష్యాలతో విలవిల్లాడుతోంది. దేశం లోని వివిధ నగరాల్లోని మట్టిలో భారీస్థాయిలో కర్బన రసాయనాలు పేరుకుపోయాయని అధ్యయనాల్లో తేలింది. పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పిసిబిలు) అనే ఈ రసాయనాలు అత్యధిక స్థాయిలో ప్రపంచ సగటు గ్రాముకు 6 నానోగ్రాములు (6 ఎన్‌జి/జి) ఉండగా , మనదేశంలో అది రెట్టింపు స్థాయిలో ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అంటే ప్రపంచ సగటు కంటే మనదేశంలో మట్టి కాలుష్యం రెట్టింపు స్థాయిలో ఉంది. ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వివిధ రకాల గమ్ (జిగురు) ల్లో ,పాలిథిన్ సంచుల్లో, రంగులు, కందెనల్లో , టీవీలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, కెపాసిటర్లు, పురుగు మందులు, ఇతర ఉత్పత్తుల్లో పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పిసిబి) ఎక్కువగా ఉంటాయి. ఇవి మట్టిలో కరగవు. అధిక వేడి లోనూ నాశనం కావు. ఆమ్లాలు, క్షారాలు, వీటిని ఏమీ చేయలేవు. అందువల్ల ఇవి మట్టిలో పేరుకుపోయి విషవ్యర్థాలుగా మారి హైడ్రోజన్ క్లోరైడ్, డయాక్సిన్లు, వంటి ప్రమాదకర రసాయనాలు వెలువరిస్తున్నాయి.
ఈ పిసిబిల కారణం గానే క్యాన్సర్, చర్మ వ్యాధులు, కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయి. బ్రిటన్, అమెరికా, జపాన్ పరిశోధన సంస్థల సహకారంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, గోవా, ఆగ్రా నగరాల్లో కాలుష్య స్థాయి పరీక్షలు జరిగాయి. భూ ఉపరితలానికి 20 సెంటీమీటర్ల వరకు మట్టి తవ్వి నమూనాలు పరీక్షించారు. చెన్నై లో అత్యధికంగా ఈ కాలుష్యాలు ఉన్నట్టు బయటపడింది. చెన్నై తరువాత బెంగళూరు మట్టి లోనూ ప్రమాదకర రసాయనాలు పేరుకుపోయినట్టు గుర్తించారు.
ఈ పిసిబి వ్యర్థాల నియంత్రణ కోసం అంతర్జాతీయ ఒప్పందంపై గతంలో భారత్ సంతకం చేసింది. దాని ప్రకారం పిసిబిల తయారీ, దిగుమతులపై నిషేధం కూడా అమలు లోకి వచ్చింది. 2025 నాటికి వీటి వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని లక్షంగా పెట్టుకున్నారు. అయినాసరే పిసిబి వ్యర్థాలున్న ఉత్పత్తులు భారీగానే పోగవుతున్నాయి. రసాయనాలు నేల పొరల్లో అతిగా చేరినేల నాణ్యత దెబ్బతింటోంది. అమూల్యమైన ఖనిజాలను, ఇతర మూలకాలను విరివిగా మానవ జాతికి అందించే పుడమితల్లిని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నామో ఆలోచించాలి.