బెంగళూరు: కర్నాటకలోని కలబురగిలో ఆదివారం 3.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని కర్నాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ కేంద్రం(కెఎస్‌ఎన్‌డిఎంసి) తెలిపింది. కలబురగి జిల్లాలోని కల్గీ తాలూకలోని కొడదూర్‌కు ఈశాన్యంగా రెండు కిమీ. దూరంలో ఉదయం 6.05 గంటలకు 3.0 తీవ్రతతో కూడిన భకంపం చోటుచేసుకుంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగలేదని అధికారులు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని వారు ధైర్యం చెప్పారు.
ఈ భూకంప ప్రకంపనలకు అనేక కారణాలున్నాయని కర్నాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ మనోజ్ రాజన్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. భూ ప్రకంపనల అనంతరం అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మినరల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మమ్మ తెలిపారు. నష్టం అతి తక్కువ ఉండేలా చూసేందుకు ప్రజలను భూకంపం విషయంలో చైతన్యం చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.