భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగెత్తిన జనం
రిక్టర్ సేలుపై తీవ్రత 4గా నమోదు
మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: రాష్ట్రంలోని మంచిర్యాల, కరీంనగర్‌జిల్లాల్లో శనివారం ఉదయం పలుచోట్ల భూమి కంపించింది. దీంతో జనం ఇండ్ల నుండి పరుగులు పెట్టారు. కరీంనగర్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4గా నమోదు కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్, రాంనగర్, గోసేవ మండల్, పున్నంబట్టివాడ, పాతమంచిర్యాల, శ్రీనగర్‌తో పాటు కోల్‌బెల్టు ప్రాంతాలైనా సీతారాంపల్లి, నస్పూర్ ప్రాంతాలలో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 10.24 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్లలోని వస్తువులు కిందపడడంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సీతారాంపల్లి, నస్పూర్ ఏరియాలలో ఓపెన్‌కాస్టు గనులు ఉండడం వల్ల బొగ్గును వెలికి తీసేందుకు జరిపిన బ్లాస్టింగ్ కారణంగా భూమి కంపించి ఉంటుందని భావించగా అనంతరం భూకంపం సంభవించినట్లు తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల వద్ద పని చేస్తున్న కార్మికులు సైతం భూమి స్వల్పంగా కంపించినట్లు గుర్తించి కొద్ది సేపు పనులను నిపివేశారు. ఏదిఏమైనా మంచిర్యాలజిల్లాలోని పలుచోట్ల భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.