మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో రెండు భారీ భూకంపాల ప్రళయానికి మృతుల సంఖ్య వెయ్యి దాటడం అత్యంత శోచనీయం. ఈ విపత్తుతో ఛిన్నాభిన్నమైన ఆ దేశాలను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ప్రపంచం లో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రమాదకరమైన ప్రాంతాల్లో మయన్మార్ ఒకటి. గత వందేళ్లలో మయన్మార్‌లో 14 భూకంపాలు వచ్చాయి. మయన్మార్ భూగర్భంలో పొరల అమరికల్లో లోపాలు ఉన్నాయి. దీనిని సంగాయిక్ ఫాల్ట్‌గా వ్యవహరిస్తుంటారు. మయన్మార్‌లో ఈ సంగాయిక్ ఫాల్ట్ దాదాపు 1200 కి.మీ పరిధిలో విస్తరించింది. ఈ పొరల కదలికలు ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్టు 18 మి.మీ అంటే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మార్పులను అంచనా వేయగలిగిన శాస్త్రవేత్తలు భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయో ముందుగా పసికట్టలేకపోవడం ఆధునిక శాస్త్రపరిశోధనకు సవాలుగా నిలిచింది.
అంతరిక్షంలో గ్రహాంతర వాసంకోసం విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఏ గ్రహశకలం ఎప్పుడు భూమిని ఢీ కొడుతుందో ముందుగానే హెచ్చరిస్తున్నారు. సూర్యునిలో వస్తున్న మార్పులను, సౌర తుపాన్ల వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా మన భూమి అడుగున ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. భూమి ద్రవీకరణ చెందినప్పుడు నేల తన సహజ స్వభావ లక్షణాలను కోల్పోయి చిక్కని ద్రవంగా మారుతుందని ఫలితంగా భూకంపాలకు దారి తీస్తుందని భారత్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూగర్భం ఏడు ఫలకలుగా విడిపోయి ఉంటుందని, వీటిలో కదలికలు ఏర్పడితే ఒత్తిడి పెరిగి సంఘర్షిస్తుంటాయని, ఫలితంగా ఆకస్మికంగా శక్తితరంగాల రూపంలో భూమి ఉపరితలానికి చేరి భూకంపంగా ప్రళయం సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. భూకంపాలపై జరుగుతున్న పరిశోధనల్లో కొంతవరకు పురోగతి కనిపిస్తోంది. భూకంపం రావొచ్చని ముందుగా అంచనా వేసే స్థాయి వరకు చేరుకోగలిగినా, ఎప్పుడు, ఎక్కడ కచ్చితంగా వస్తుందో చెప్పలేకపోతున్నారు. అలా చెప్పగలిగితే కొన్ని వేల ప్రాణాలను, ఆస్తులను కాపాడగలుగుతారు. ఎనిమిదేళ్ల క్రితం దక్షిణ కాలిఫోర్నియా, దక్షిణ మధ్య అలస్కా ప్రాంతాల్లో తక్కువ స్థాయి లో ప్రకంపనలు నమోదైనప్పుడు భూకంపం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ముందుగానే ఊహించగలిగారు.
వారు ఊహించినట్టుగానే ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇది చాలా తక్కువస్థాయి ప్రకంపనలకే పరిమితం అయింది. భారీ స్థాయి భూకంపాలను మనం ముందుగా అంచనా వేయలేమా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే భూకంపాలు వచ్చే ముందు ఏర్పడే ప్రకంపనలను కొన్ని వన్యప్రాణులు ముందుగానే పసిగట్ట గలుగుతున్నాయని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. భూకంపం రావడానికి కొన్ని రోజుల ముందే పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి దూరంగా వెళ్లిపోతాయని, పశుపక్షాదులు వింతగా ప్రవర్తిస్తుంటాయని చెబుతున్నారు. పావురాళ్లు తమ దిశను మార్చుకుంటాయని, కుక్కలు, పిల్లులు, ఎలుకలు అసాధారణంగా అరుస్తాయని అంటున్నారు. అలాగే నీటిలో చేపల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తుంటాయని వివరిస్తున్నారు. ఇంత లోతుగా పరిశీలిస్తున్నప్పుడు ఈ వన్యప్రాణుల ప్రవర్తన ఆధారంగా భూకంపాలను ముందుగానే కనుక్కునే సాంకేతికత అభివృద్ధి చేయవచ్చన్న సూచనలు వస్తున్నాయి. మన దేశంలో కూడా భూకంపాల ప్రభావం కనిపిస్తోంది. భారత దేశం భూ ఫలక ఉత్తర దిశగా ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. ఈ ఫలక సంవత్సరానికి 5 సెం.మీ చొప్పున కదులుతుంది. భారత దేశానికి పైభాగంలో ఉన్న యురేషియన్ భూఫలక ఉత్తరదిశగా ఏడాదికి రెండు సెం.మీ చొప్పున కదులుతోంది. ఈ రెండు ఫలకల కదలికల్లో తేడాలు ఉండడం వల్ల భారత భూఫలక, యురేషియన్ ఫలకను ఢీకొడుతుంది. అందుకే హిమాలయాల ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవిస్తున్నాయి.
దేశ చరిత్రలో ఇప్పటివరకు ముఖ్యమైన భూకంపాల తీవ్రతలు 5.4 8.4 మధ్యే నమోదయ్యాయి. భూకంపం వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ఐదు సెస్మిక్ జోన్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ లెక్కన జోన్ 5లో ఉంటే భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు, జోన్ 1లో ఉంటే భూకంపం వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు భావించవచ్చు. జోన్ 5 లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే వీలున్నట్టు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తర, మధ్య బీహార్, గుజరాత్‌లోని రానా ఆఫ్ కచ్ ఈ జోన్ లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఏడాది డిసెంబర్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జోన్ 3 లో తెలంగాణ లోని రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, ఖమ్మం, బెల్లంపల్లి, భద్రాచలం ఉన్నాయి. ఆంధ్రలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాలు ఈ జోన్ కిందకు వస్తాయి. భూకంపాల ప్రమాదాలను నివారించాలంటే భూకంప నిరోధక నిర్మాణ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భూకంపాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. భూకంపం సంభవించిన వెంటనే పరిశోధనలతోపాటు, ఆ ప్రకంపనలను విపత్తు నిర్వహణ సంస్థలు తక్షణమే విశ్లేషించగలగాలి. అప్పుడే అత్యవసర సేవలను బాధితులకు సత్వరం అందించడానికి వీలవుతుంది.