మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను భూప్రకంపనలు వణికించాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ములు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూమి లోపల 40 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు ఎన్‌జిఆర్‌ఐ రిటైర్డ్ సైంటిస్ట్ నగేష్ చెప్పారు. తెలంగాణ రీజన్‌లో 5.3 భూకంప తీవ్రత అనేది అరుదు. గతంలో 1969లో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఉదయం 7.20 నుంచి 7.26 గంటల మధ్య భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో..
తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌తో పాటుగా రంగారెడ్డి, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రంకపనలతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో తీవ్రత కనిపించింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో భూమి 2 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది. హైదరాబాద్ జోన్2 పరిధిలో ఉంది. అందులోను తక్కువ భూ కంపాలు వచ్చే జోన్‌లో ఉన్నప్పటికీ భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది. సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు జనాలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటూ పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.ఉదయం 7.27 నిమిషాలకు వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి సహా పలుచోట్ల భూమి కంపించింది. భూ ప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి.
సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకన్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్లు ఇచ్చాయి. పలు షాపుల్లో ఉన్న వస్తువులు కిందపడి చెల్లాచెదురయ్యాయి. ఇంటిబయట పెట్టిన బైక్ కూడ కదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంచిర్యాల, చెన్నూర్ , జైపూర్ మండలాల్లో భూమి కంపించింది. వరంగల్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 నిమిషాల నుంచి 7.45 వరకూ భూమి ఊగినట్లు అనిపించింది. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి. 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. సింగరేణి కోల్ బెల్ట్‌కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు వచ్చాయి. కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూ కంపం రావడం ఇదే తొలిసారి. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 7.27 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి.
ఎపిలో..
ఏపీలోనూ పలు చోట్ల భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్‌ను భూ ప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, జగ్గయ్యపేట, నందిగామతో పాటుగా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ,తిరువూరు, పెనుగంచిప్రోలు, గంపలగూడెం, అనుముల్లంక ప్రాంతాల్లో భూమి కంపించింది.
మేడారం కేంద్ర స్థానం
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 20ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. గోదావరి బెల్ట్‌లో భూమి పొరల్లో చాలా తేడాలున్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ప్రకంపనలు సంభవించాయని ఎన్‌జిఆర్‌ఐ రిటైర్డ్ సైంటిస్ట్ నగేష్ అంటున్నారు. 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించింది. 1983 మేడ్చల్‌లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా 2021 జనవరి 26న పులిచింతలలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4తీవ్రతకు పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు ఇవే అని రిటైర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు: శాస్త్రవేత్తలు
ఈ భూ ప్రకంపనల కేంద్రాన్ని తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదుకాగా..భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో భూమి కంపిచిందని చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ తీవ్రతతో నేడు ప్రకంపనలు వచ్చినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.