కాకినాడ, చెన్నైలో ప్రకంపనలు
చెన్నై/కాకినాడ: బంగాళాఖాతంలో భూకంపం ఏర్పడడంతో మంగళవారం కాకినాడ, చెన్నైలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎక్కడ నుంచి తెలియరాలేదు. మధ్యాహ్నం 12.35 ప్రాంతంలో బంగాళాఖాతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల అడుగుల లోతులో భూకంపం వచ్చింది. కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశగా 296 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు తూర్పు-ఈశాన్య దిశగా 320 కిలోమీటర్ల దూరంలో భూకంపం ఇది జరిగందని పరిశోధనా కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజోలు, పాలకొల్లు, నరసాపురం పట్టణాలలో ప్రజలు భూప్రకంపనలు గమనించారు. కాకినాడలో ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు కదలడం, అల్మారాల్లోని వస్తువులు కిందపడడం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కొద్ది సెకండ్ల పాటు ప్రకంపనలు ఉన్నాయని, ఎటువంటి నష్టం సంభవించలేదని వారు చెప్పారు. చెన్నైలోని అడయార్, తిరువాన్మియూర్, నంగనల్లూరు తదితర ప్రాంతాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.