టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో ఒకదాని సమీపంలో మంగళవారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించగా కనీసం 95 మంది ప్రాణాలు కోల్పోయారు, మరి 130 మంది గాయపడ్డారు. పొరుగున ఉన్న నేపాల్‌లో కూడా భూప్రకంపనలు సంభవించి భవనాలు ఊగిపోగా, ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీయవలసి వచ్చింది. ప్రాంతీయ విపత్తు సహాయ కేంద్రం సమాచారం ప్రకారం, టిబెట్ స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతంలోని జిగెలో డింగ్రీ కౌంటీని మంగళవారం ఉదయం 9.05 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) భూకంపం కుదిపివేసింది. అయితే, యుఎస్ జియోలాజికల్ సర్వీస్ భూకంపం తీవ్రతను 7.1గా నమోదు చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కనీసం 95 మంది మరణించినట్లు, మరి 130 మంది గాయపడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్‌హువా వార్తా సంస్థ తెలియజేసింది.
బాధిత ప్రాంతాల్లో సహాయ, రక్షణ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు. నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిమీ దూరంలోని లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిమీ లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలియజేశారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తరువాత టిబెట్ ప్రాంతంలో మరి రెండు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వాటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.