Sunday, November 24, 2024

టర్కీ, సిరియాలో విలయం

- Advertisement -
- Advertisement -

అజ్మెరిన్ : పశ్చిమాసియాలోని టర్కీ (తుర్కియా), సిరియా దేశాలు సోమవారం తెల్లవారుజామున అత్యంత తీవ్రస్థాయి పెనుభూకంపాల తాకిడికి గురయ్యాయి. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు తలెత్తిన భూ ప్రకంపనల తీవ్రతతో 2300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భయాందోళనలు నెలకొన్నాయి. తొలుత రెక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో తొలుత సంభవించిన ప్రకంపనలతో పలు భవనాలు నిర్మాణాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఈ ఘటనల్లో ఈ రెండు ఇరుగుపొరుగుదేశాలలో కలిపి 2300 మందికి పైగా మృతి చెందారు. కనీసం 810 మంది రెబెల్, ప్రభుత్వ అధీన సిరియా ప్రాంతాలలో మృతి చెందారు. కాగా టర్కీలో 1498 మంది వరకూ ప్రాణాలు కోల్పొయ్యారు. తొలి తీవ్రస్థాయి ప్రకంపనల తరువాత వరుసగా క్షణాల వ్యవధిలోనే 50 వరకూ స్వల్ప ప్రకంపనలు చెలరేగాయి. అయితే ఓ వైపు తొలిసారి ప్రకంపనలకు స్పందించి సహాయక చర్యలు జరుగుతున్న దశలోనే రెండోసారి 7.5 తీవ్రతతో , మూడోసారి 6 పాయింట్ల తీవ్రతతో ప్రకంపనలు తలెత్తడంతో పరిస్థితి దిగజారింది.

దీనితో ప్రాణనష్టం పెరిగింది. మరింతగా భవనాలు కుప్పకూలాయి. భూకంపాల తీవ్రత గ్రీన్‌ల్యాండ్ వరకూ ప్రభావం చూపింది. శిథిలాల కింద పలువురు చిక్కుకు పోయి ఉండటంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే వీలుంది. తొలుత తీవ్రస్థాయి ప్రకంపనలు ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలను దాదాపుగా శిథిల దశకు చేర్చిన క్రమంలోనే కొద్ది గంటల వ్యవధిలోనే మరో రెండు సార్లు భూమి బలంగా కంపించింది. పలు రకాల సహాయ చర్యలు ప్రకంపనల దశలో నిలిచిపోతున్నాయి. సిరియా అంతర్యుద్ధం, ఇతరత్రా ఘర్షణలతో లక్షలాది మంది సిరియా నుంచి తరలివచ్చి , టర్కీలోని పలు నగరాల్లో చాలా కాలంగా తలదాచుకున్న స్థితిలోనే ఇప్పటి ప్రకంపనలు ఈ ప్రాంతాలను పూర్తిగా దెబ్బతీశాయి.

పలు అంతస్తుల భవనాలు నేల మట్టం కావడం, వీధులలోకి జనం వేల సంఖ్యలో చేరడంతో సహాయక చర్యలు వేగవంతం కాని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున సరిహద్దులకు ఇటూ అటూ ఉన్న దేశప్రజలు కళ్ల ముందు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఇళ్లు ఊగిపోతున్న దశలో నిద్రలేవాల్సి వచ్చింది. పలువురు బయటకు పరుగులు తీయగా, వేలాది మంది శిథిలాల కింద నలిగి మృతి చెందారు. ఓ వైపు తీవ్రమైన చలి, కొన్ని ప్రాంతాలలో వర్షాల మధ్యనే భారీగా మంచుకురుస్తోన్న దశలోనే దశాబ్ధంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రకృతి వైపరీత్యం నెలకొంది. గంటల వ్యవధిలోనే రెండు అనంతర ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. పలు నగరాలలో సహాయక బృందాలు ,స్థానిక యువకులు రంగంలోకి దిగి గాయపడ్డ వారిని, తమ వారిని శిథిలాల నుంచి బయటకు తీసే పనిలో పడ్డారు.

టర్కీ నుంచి సిరియాకు రోగుల తరలింపు

టర్కీలో ఓ ఆసుపత్రి భూకంప తీవ్రతతో కుప్పకూలింది. దీనితో అతి కష్టం మీద ఇక్కడి రోగులను, శిశువులను సిరియాలోని కొన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టర్కీలోని అదానా ప్రాంతంలో పరిస్థితి భయానకంగా మారింది. పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురి ఆర్తనాదాలు రక్షించాలనే దీనమైన పిలుపులతో ఈ ప్రాంతం అంతా విషాదభరితం అయింది. దియార్‌బకిర్‌కు తూర్పు దిక్కున ఉన్న ప్రాంతంలో కుప్పకూలిన భవనాలతో ఆ ప్రాంతం అంతా కాంక్రీట్ పర్వతాల తరహాలో చెక్కుచెదిరిపోయింది. ఇప్పటి పెను భూకంపం ప్రధాన కేంద్రం టర్కీ ప్రాంతీయ రాజధాని గజియాన్‌టెప్‌కు ఉత్తర దిశలో 33 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతులో నెలకొని ఉన్నట్లు కైరోలోని భూకంప నిపుణులు అంచనావేశారు. తరచూ అంతర్యుద్ధాల సిరియాలో ఈ ప్రాంతం ఇరుదేశాలను విడదీసే సరిహద్దు రేఖలతో ఉంది. టర్కీలో 912 మంది మృతి చెందారని, పలు స్థాయిల్లో విధ్వంసం జరిగిందని దేశాధ్యక్షులు రెసిప్ తయీప్ ఎర్గోగన్ తెలిపారు.

అంతర్యుద్ధ దేశంలో మరింత భయానకం

సిరియాలో కనీసం 560 మంది వరకూ మృతి చెందారు. రెబెల్, ప్రభుత్వ అధీన ప్రాంతాలలో భారీ విలయం జరిగిందని మీడియా, వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. తొలి ప్రకంపనల తరువాత దాదాపు 50 వరకూ నామమాత్రపు అనంతర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయి తే వీటిలో రెండు ఓ మోస్తరు తీవ్రతతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానమైన తొలి ప్రకంపన తరువాతి రెండో ప్రకంప టర్కీ రాజధాని అంకారా , ఇరాక్‌లోని కుర్దిస్థాన్ నగరం ఇర్బిల్ వరకూ ప్రభావితం చేసిందని ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. టర్కీలో భూకంప బాధితులు మంచుతో నిండి ఉన్న వీధుల్లోకి తమ పైజామా బనీన్లతోనే పరుగుల మధ్య తరలివచ్చారు. తన కుటుంబానికి చెందిన ఏడుగురు శిథిలాల కింద పడి ఉన్నారని, వారి పరిస్థితి ఏమిటనేది తెలియకుండా ఉందని టర్కీలోని దియార్‌బకీర్ నగరానికి చెందిన పౌరుడు ముషితిన్ ఒరాక్కి తెలిపారు. ప్రపంచంలోనే అతి ఎక్కువగా భూకంప తాకిడి ముప్పు ప్రాంతాలలో టర్కీ కూడా ఉంది.

కుప్పకూలిన 13 శతాబ్దపు మసీదు

ఇప్పటి భూకంప తీవ్రతతో మలటయా ప్రాంతంలోని 13 వ శతాబ్ధపు పురాతన ప్రఖ్యాత మసీదు పాక్షికంగా కూలింది. ఇక్కడనే ఓ 14 అంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టం అయింది. 92 కుటుంబాలు 28 అపార్ట్‌మెంట్లలో ఇక్కడ నివసిస్తున్నారు. గజియన్‌టెప్‌లో 2200 ఏండ్ల నాటి హిల్‌టాప్ రాజప్రాసాదం దెబ్బతింది. దీనిని అప్పట్లో రోమను సైనికులు కొండపై నిర్మించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News