జకార్తా: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో సోమవారం తెల్లవారుజామున సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలేవీ వెలువడలేదు. పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్సుకు చెందిన పరియమన్ పట్టణానికి సుమారు 169 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 16 కిలోమీటర్ల లోపల 6.7 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ తెలియచేసింది. సుమత్రా ప్రావిన్సులో పలుచోట్ల భూప్రకంపనలు కనిపించాయని, అయితే సునామీ ముప్పు ఏదీ లేదని ఇండోనేషియా వాతావరణ, భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలోని లుబంగ్ దీవికి సమీపంలో సముద్రగర్భంలో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత 6.4 ఉన్నట్లు ఫిలిప్పీన్ వాల్కనాలజీ, సీస్మాలజీ సంస్థ వెల్లడించింది. చుట్టూ పసిఫిక్ మహాసముద్రం ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సర్వసాధారణం.