ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోను, ఆ తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలను నియంత్రించడంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ చీఫ్ హరీశ్ కుమార్ గుప్తాలకు ఈసీ సమన్లు జారీ చేసింది. గత మార్చిలో పోలింగ్ తేదీలు ప్రకటించినప్పుడు ఎన్నికల పోలింగ్ సంబంధిత ఘర్షణలపై ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు ముందుగా హెచ్చరించింది. మోడల్ కోడ్ అమలులోఉన్నంతవరకు హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డిజిపి చీఫ్ హరీశ్ కుమార్ గుప్తాలకు కమిషన్ సూచించింది. కేంద్ర చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్వయంగా ఎన్నికల పరిస్థితిని బుధవారం సమీక్షించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీ మద్దతుదార్ల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లా మాచెర్లలో ఈవిఎంలను ధ్వంసం చేశారు. స్థానిక అధికారుల వాహనాలపై పెట్రో బాంబుల దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. బాపట్ల ఎంపీ వాహనాన్ని తగులబెట్టారు.