హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) నియమించింది. ఈ మేరకు బుధవారం ఎఈఆర్‌ఓలను నియమిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు మండలాల తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, మున్సిపల్ సహాయ కమిషనర్లను సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా నియమించారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను, ఆర్‌ఓ/ ఎఆర్‌ఓలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) నియమించిన విషయం విధితమే.
నియోజకవర్గ స్థాయిలో 518 మంది మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ : వికాస్‌రాజ్
రాష్ట్రవ్యాప్తంగా 34,891 మంది బూత్ లెవల్ ఆఫీసర్‌లను (BLO) సన్నద్ధం చేసేందుకు, ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాలలో 70 మంది జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చారని, అదే విధంగా నియోజకవర్గాల్లో 518 మంది మాస్టర్ ట్రైనర్లు నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా మండల స్థాయిలో దశలవారీగా బిఎల్‌ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.