Sunday, January 19, 2025

రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నియమించింది. ఈమేరకు మాజీ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ట్రాక్ రికార్డు ఉన్న ఉన్నతాధికారులను నియమించింది.

ఈ ప్రత్యేక పరిశీలకులు ఎన్నికల్లో ధన ప్రభావం, కండబలం, తప్పుడు సమాచారం, తదితర అంశాలపై దృష్టి సారిస్తారని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఏడుకోట్ల జనాభా కలిగిన పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు బీహార్‌కు కూడా పరిశీలకులను పంపుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పరిశీలకులను పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై నిఘా కోసం ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమించినట్టు ఈసీ తెలిపింది.

సాధారణ, వ్యయ, రాజకీయ పరిశీలకులతోపాటు ప్రత్యేక పరిశీలకులను ఎన్నికల ప్రాంతాలకు నియమించింది. ప్రత్యేక పరిశీలకులు ఆయా రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. అవసరమైతే ఉద్రిక్త ప్రాంతాలను పరిశీలించడానికి పర్యటిస్తారు. పార్లమెంటరీ నియోజక వర్గాల, అసెంబ్లీ స్థానాలు, లేదా జిల్లాల్లో నియామకమైన పరిశీలకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రత్యేక పరిశీలకులు రప్పించుకుంటారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షిస్తుంటారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా పోలింగ్‌కు ముందు 72 గంటల్లోగా పరిష్కరిస్తారు.

మాజీ ఐఎఎస్, మాజీ ఐపిఎస్‌లే పరిశీలకులు
బీహార్‌కు సాధారణ ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఎఎస్ మంజిత్ సింగ్, పోలీస్ ప్రత్యేక పరిశీలకునిగా మాజీ ఐపిఎస్ వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ నియమించింది. మహారాష్ట్రలో ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఎఎస్ దర్మేంద్ర ఎస్ గాంగ్వార్, పోలీస్ ప్రత్యేక పరిశీలకునిగా మాజీ ఐపిఎస్ ఎన్‌కె మిశ్రా నియామకమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ అజయ్ వి నాయక్, పోలీస్ ప్రత్యేక పరిశీలకునిగా మాజీ ఐపిఎస్ మన్మోహన్ సింగ్ నియామకమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్‌మోహన్ మిశ్రా, ప్రత్యేక పోలీస్ పరిశీలకునిగా మాజీ ఐపిఎస్ అధికారి దీపక్ మిశ్రా నియామకమయ్యారు. ఒడిశాకు ప్రత్యేక పరిశీలకునిగా మాజీ ఐఎఎస్ అధికారి యోగేంద్ర త్రిపాఠి, ప్రత్యేక పోలీస్ పరిశీలకునిగా మాజీ ఐపిఎస్ రజనీకాంత్ మిశ్రా నియామకమయ్యారు. పశ్చిమబెంగాల్‌కు ప్రత్యేక పరిశీలకునిగా మాజీ ఐఎఎస్ అలోక్ సిన్హా, ప్రత్యేక పోలీస్ పరిశీలకునిగా రిటైర్డ్ ఐపిఎస్ అనిల్‌కుమార్‌శర్మ నియామకమయ్యారు. ఐదు రాష్ట్రాలకు ప్రత్యేక వ్యయపరిశీలకులు నియామకమయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు రాజేష్ తుతేజా, ఒడిశాకు హిమాలినీ కాశ్యప్, కర్ణాటకకు బి. మురళీ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కు నీనా నిగం, తమిళనాడుకు బీఆర్ బాలక్రిష్ణన్, నియామకమయ్యారు. వీరంతా మాజీ రెవెన్యూ సర్వీస్ అధికారులే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News