మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల గోడలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తగిన డబ్బులు చెల్లించి బహిరంగ స్థలాల్లో నినాదాలు రాయడానికి, పోస్టర్లు అతికించడానికి, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, రాజకీయ ప్రకటనల ఏర్పాటుకు స్థానిక చట్టాలు అనుమతిస్తున్నట్లయితే ఆ పని నిబంధనల ప్రకారమే చేయాలని పేర్కొంది.
మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు..
మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునితో పాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్‌కుమార్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు మునుగోడులో పరిశీలకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పోలీస్ పరిశీలకుడిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ మూడో తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు.
EC banned posters on Government Office Walls