ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన ఓటు హక్కుతో నచ్చిన వారికి అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే కుతూహలంతో ఎదిరిచూస్తారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వజ్రాయుధంలా వినియోగించుకునేది ఓటు హక్కును మాత్ర మే. పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటు హక్కు అగుపడని ఓ రాజముద్ర. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు అనే బ్రహ్మాస్త్రం, మంచి చెడులను గ్రహించే హక్కు ను భారత రాజ్యాంగం మనకు కల్పించింది.
ప్రపంచాన్ని శాసించగల శక్తి, ప్రజాస్వామ్యాన్ని బతికించే యుక్తి ఓటరుకు ఉంది.
ఎంతో విలువైన ఓటు హక్కును అర్హతగల ప్రతి ఒక్కరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజూ జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ‘బలమైన ప్రజాస్వామ్యం ఏర్పాటు కోసం ఓటు నమోదు, బాధ్యత అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతి ఏటా బూత్ స్థాయిలో, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతేకాకుండా కొత్తగా ఓటర్లుగా నమోదయిన యువతీ యువకులను, ఉత్తమ అధికారులను ఓటరు దినోత్సవం రోజున ఘనంగా సన్మానిస్తారు.
భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఓటర్లు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తున్నది. సమకాలీన రాజకీయాల్లో ‘మనిషి విలువ కన్నా’ మని విలువే ఎక్కువ అయింది. దీనికి ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. హక్కులను కాలరాస్తున్న కారకులు ఎవరు? అని ప్రతి ఒక్క ఓటరు మహాశయులు ప్రశ్నించుకోవాలి? లంచం ఇచ్చేవాడు మాత్రమే కాదు.. తీసుకునేవాడు కూడా నేరస్థుడే. అందుకే ఓటుకు నోటు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి చక్రవడ్డీతో దోచుకునేందుకు ప్రజాప్రతినిధులను వెనుకాడడం లేదు. తయారు చేసింది కూడా ఓటరు మహాశయులే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నా దేశ ప్రజలకు కత్తిని చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకొని రాజులౌతారో, ఓటును అమ్ముకొని బానిసలుగా ఉంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది అన్నారు.
నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులలోనే ఈ ప్రలోభాల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అధికారమే ఏకైక లక్ష్యంగా పాలకులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి సంపాదనే గెలుపే లక్ష్యంగా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు విజ్ఞానవంతులు కులం, మతం , డబ్బుకు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగి ఓటేస్తున్నారనేది జగద్విదితం. నేడు స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్‌లో నడుస్తున్నదనే విమర్శ ఉంది. ఇటీవల జరిగిన తాజా పరిణామాలు నిలువెత్తు ప్రతిరూపం.
ప్రధాన మంత్రిగా చంద్రశేఖర్ ఉన్న సమయంలో నియమించిన టి.ఎన్ శేషన్ ఎన్నికల కమిషన్ బాధ్యతలు చేపట్టే నాటికి ఎన్నికల్లో మూడు కిడ్నాప్ లు ఆరు హింసగా యథేచ్ఛగా జరుగుతుండేది. దాని కారణంగా కొన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు. ఇది గ్రహించి శేషన్ పోలింగ్ కేంద్రాల వద్ద బందో బస్తును భారీగా పెంచారు. రిగ్గింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేశారు. ఓటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నారు. 1991లో మత ఘర్షణలతో పరిస్థితులు వేడెక్కిన సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం అధికంగానే నమోదయిందంటే అందుకు కారణం శేషన్ సంస్కరణలే. విధి నిర్వహణలో చండశాసనుడిగా టి.ఎన్. శేషన్‌కు పేరుంది. భారతావనిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఆయన అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు.
ఓటర్లలో అభద్రతా భావాన్ని తొలగించారు. ఎన్నికల ప్రక్రియలో చట్టాలను కఠినంగా అమలు చేశారు. అయితే శేషన్ పెట్టిన కఠినమైన మార్గదర్శక సూత్రాల మూలంగా రాజకీయ పార్టీలలో వణుకు పుట్టింది. గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పని తీరుపై ప్రతిపక్షాల నుంచి ప్రజాస్వామ్యవాదుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామకం వివాదాస్పదం అయింది. న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ తరహాలో ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత ఉండాలని కోరుతున్న పిటిషన్ల కారణంగా సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. 2011 నుంచి ఏటా ఒక్కో నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గతేడాది 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ‘మా ఓటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా, సురక్షితంగా సమాచారం ఇవ్వడం’ అనే నినాదంతో నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేనివారిని, ప్రత్యామ్నాయ రాజ్య వ్యవస్థలను విశ్వసించే వారిని వదిలేయండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంపైన నమ్మకం ఉన్నవారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండడం ఎట్లా అర్థం చేసుకోవాలి?
చదువుకున్న వారు, సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన కలిగిన వారు, భవిష్యత్తును నిర్దేశించే శక్తియుక్తులు ఉన్నవారు ఓటింగ్‌కు దూరం గా ఉండడం, ప్రజాస్వామ్యం వ్యవస్థను బలోపేతం చేసే సంకేతం ఏమాత్రం కాదు. న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్య అధ్యయనవేత్తలు, సామాజిక పరిశోధకులు, తమ తమ పద్ధతుల్లో బుద్ధిజీవులు ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాన్ని పరిశోధించారు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు తాము ఆశించిన గుణగణాలు ఉన్న అభ్యర్థులు లేనందున ఎవరు గెలిచినా ఒకటే అనే భావన ఏర్పడింది. యోగ్యత లేని వారందరిలో తక్కువ చెడు లక్షణాలు కలిగిన వారిని ఎన్నుకోక తప్పని పరిస్థితి ఉన్నందున బుద్ధిజీవులు ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం. ఓటుకు నోటు సంస్కృతి పోవాలంటే అభ్యర్థులకు ప్రచారం చేసుకునే వెసలుబాటు ఇవ్వని సంస్కరణలు తెచ్చే శేషన్ మళ్ళీ రావాలి. విద్యావంతులు సిగ్గువిడిచి ఓటుకు నోటు అడుగుతుంటే, అభ్యర్థులు పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకునేందుకు, భవిష్యత్త్ తరాలకు సరిపోనూ నాయకులు అక్రమాలు చేయక తప్పడం లేదనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
సంగని మల్లేశ్వర్
9866255355